గుర్రపు డెక్క పెరుగుతున్నా..
తుర్కయంజాల్: సీజనల్ వ్యాధులు, విష జ్వరాల బారిన పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా శంషాబాద్ జోనల్ పరిధిలో దోమల నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం. తుర్కయంజాల్, ఆదిభట్ల, తుక్కుగూడ, జల్‌పల్లి, శంషాబాద్ మున్సిపాలిటీలతో పాటు మీర్‌పేట, బడంగ్‌పేట కార్పొరేషన్‌లను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేసి పది నెలలు పూర్తవుతున్నా నేటికీ ఎంటమాలజీ విభాగానికి సిబ్బందిని కేటాయించకపోవడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. జోన్ పరిధిలోని పలు డివిజన్‌లకు చెందిన ప్రజలు దోమలతో సహజీవనం చేయాల్సిన దుస్థితి నెలకొంది. గడిచిన ఏడాది డెంగీతో పలువురు మృతి చెందగా, ఎంతో మంది ఆస్పత్రుల పాలైన సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం శంషాబాద్, జల్‌పల్లి, బడంగ్‌పేట ప్రాంతాల్లో డెంగీ కేసులు నమోదవుతున్న సంఘటనలు ఉన్నాయి.
అధికారుల కేటాయింపు మాత్రమే..
ఎంటమాలజీ విభాగంలో ఏఎంహెచ్‌ఓ డా.శారద, అనురాధతో పాటు మరి కొందరు సూపర్ వైజర్‌లు మాత్రమే ఉన్నారు. క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ తిరిగి నిల్వ నీటిని గుర్తించడం, దోమల లార్వాల నియంత్రణకు చర్యలు తీసుకునే సిబ్బందిని పది నెలలుగా కేటాయించలేదు. సిబ్బంది నియామకానికి టెండర్లు పిలుస్తున్నామని చెబుతున్నా అది కార్యరూపం దాల్చడం లేదు. ఒక్కో డివిజన్‌కు 15 నుంచి 20 మంది వరకు సిబ్బంది అవసరం ఉంది. ఒక్కరిని కూడా నియమించకపోవడం చూస్తుంటే జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారుల చిత్తశుద్ధి అర్థమవుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి, మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఫాగింగ్ యంత్రాలు కరువు
గతంలో మున్సిపాలిటీలుగా ఉన్న సమయంలో ఫాగింగ్ మెషిన్‌ల పేరుతో అనేకమార్లు వేలకు వేల రూపాయల బిల్లులను డ్రా చేసిన అధికారులు ప్రస్తుతం వాటిని చూపించకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిభట్ల సర్కిల్ పరిధిలో ప్రస్తుతం ఒక్క పెద్ద మిషన్, ఒక్క చిన్న మెషిన్ మాత్రమే ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. మరో మూడు చిన్న మెషిన్‌లు పాడై పోయాయని, వీటిని బాగు చేయించాలంటే వేల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉందంటున్నారు. డివిజన్‌ల విస్తీర్ణం, జనాభా దృష్ట్యా ఒక్కో దానికి ఒక పెద్ద మెషిన్, 5 వరకు చిన్న మెషిన్‌ల అవసరం ఉంది. అయినా అధికారులు వాటిని సమకూర్చడంపై దృష్టి సారించడం లేదు.
ఫాగింగ్ మందు కరువు
దోమల నియంత్రణకు డెంగీ ప్రబల కుండా ఉండాలంటే పైరిక్రమ్ (పెరిత్రిన్) మందును ఫాగింగ్ చేస్తుంటారు. నిల్వ నీటిలో దోమ లార్వాల నియంత్రణకు తెమో పాస్ చల్లుతుంటారు. ఈ రెండు కెమికల్స్ దోమల నియంత్రణకు ఎంతో అవసరం. జోనల్ పరిధిలోని ఏ సర్కిల్‌లోను ఈ రెండు కెమికల్స్ లేవు. ఇప్పటి వరకు వీటిని ఇవ్వలేదని సమాచారం. రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పటికై నా మొద్ద నిద్ర వీడి, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సరైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
దోమల స్వైర విహారం
విష జ్వరాల బారిన జనం
నియంత్రణకు చర్యలు శూన్యం
జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీలను విలీనం చేసి పది నెలలు
నేటికీ సిబ్బందిని కేటాయించని వైనం
ఫాగింగ్ మెషిన్‌లు, కెమికల్స్ లేనే లేవు
శంషాబాద్ జోనల్ పరిధిలోని అన్ని సర్కిళ్లకు కలిపి కనీసం ఒక్క ఫ్లోటింగ్ మెషిన్ కూడా లేదు. దీంతో చెరువుల్లో గుర్రపు డెక్క పెరిగిపోతోంది. అందుబాటులో మెషిన్ ఉంటే ఎప్పటికప్పుడు దీన్ని తొలగించడానికి అవకాశం ఉంటుంది. తొలగించకపోవడంతో నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది. బండంగ్‌పేట సర్కిల్ పరిధిలోని పలు చెరువులను పరిశీలించిన ఉన్నతాధికారులు దోమల వృద్ధికి అధికంగా కారణమవుతున్నాయని గుర్తించినా చర్యలు మాత్రం లేవు. దోమల లార్వాలను తినే దాంబూజియా చేపలను కూడా వదలకపోవడంతో చెరువుల్లో దోమల లార్వాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి.
ఉన్నతాధికారుల దృష్టికి ..
జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన నాటి నుంచి సిబ్బందిని కేటాయించని మాట వాస్తవమే. దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కెమికల్స్ కొరతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఫాగింగ్ మెషిన్‌లు కూడా రావాల్సిన అవసరం ఉంది.
– డా.శారద, ఏఎంహెచ్‌ఓ,
ఆదిభట్ల సర్కిల్


