వెల్దండ: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందిన సంఘటన వెల్దండ మండల పరిధిలోని దర్గా సమీపంలో హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన అన్నవరం అనిత (40) భర్త గోపాల్‌తో కలిసి వెల్దండకు వచ్చింది. అనిత కుమారుడు వెల్దండలోని మామిడి తోటల్లో పనిచేస్తున్నాడు. అనారోగ్య కారణంగా కొంతకాలంగా ఆమె మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో సోమవారం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని భర్త, కుమారుడు నిర్ణయించారు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేశారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో అనిత ఎవరికీ చెప్పకుండా మామిడి తోట నుంచి రోడ్డువైపు నడుచుకుంటూ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు భావిస్తున్నారు. అనిత కనిపించకపోవడంతో భర్త గోపాల్, కుమారుడు ఆమె కోసం గాలించారు. స్వగ్రామమైన చింతలపల్లిలోనూ ఆరా తీశారు. చివరకు రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన విషయం తెలుసుకున్నారు. సోమవారం రాత్రి కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలోని మృతదేహాన్ని పరిశీలించి అనితగా గుర్తించారు. భర్త గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యుగంధర్ తెలిపారు. మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.


