● మాకెందుకు రిక్తహస్తం!
● నామినేటెడ్ పదవుల కేటాయింపుపై దళిత, గిరిజన నేతల ఆందోళన
● కష్టపడ్డ వారిని గుర్తించాలని అభ్యర్థన
బషీరాబాద్: ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన తమకు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తగిన గుర్తింపు దక్కడం లేదని మండలానికి చెందిన పలువురు ఎస్సీ, ఎస్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించామని, సొంత ఖర్చులతో ప్రచారం చేసి కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచామని చెబుతున్నారు. అయినప్పటికీ పదవుల విషయంలో తమను పక్కన పెడుతున్నారని వాపోతున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తూ, మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన తమకు నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా తమకు దక్కిందేమిటని ప్రశ్నిస్తున్నారు.
పార్టీ జెండా మోసినా..
మండల యువజన కాంగ్రెస్ నాయకుడు కొర్విచెడ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డిపై అభిమానంతో గతంలో కొడంగల్, మల్కాజిగిరిలో సొంత ఖర్చులతో ప్రచారం చేశానన్నారు. ఐటీ దాడుల సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డికి మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని గుర్తుచేశారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేశామని, అయినా ఇప్పటివరకు పార్టీలో చిన్న నామినేటెడ్ పదవి కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి పలువురు దళిత నాయకులకు అవకాశాలు రాకుండా ఒకరిద్దరు నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
చైర్మన్ హామీ.. వైస్‌తో సరి
మండల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అల్లాపూర్ శంకరప్పకు బషీరాబాద్ ఏఎంసీ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చి చివరకు వైస్ చైర్మన్ పదవితో సరిపెట్టారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ప్రొటోకాల్ లేని పదవిలో కొనసాగలేనని, రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సన్నిహితుల వద్ద శంకరప్ప ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే గిరిజన నాయకులకు కూడా పార్టీలో నిరాశే ఎదురవుతోందనే చర్చ సాగుతోంది. మండలంలోని వాల్యానాయక్‌తండాకు రామునాయక్ పార్టీలో తనకు తగిన గుర్తింపు దక్కడం లేదని ముఖ్య నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
గుర్తింపు దక్కేనా..?
మండలంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పలువురు నాయకులు పదవుల విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యం కల్పించాలని, సామాజిక సమీకరణాలకు అనుగుణంగా అవకాశాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి చొరవ తీసుకుని తమ సమస్యలను పరిష్కరించి, పార్టీ కోసం పనిచేసిన, చేస్తున్న దళిత, గిరిజనులకు తగిన గుర్తింపు ఇవ్వాలంటున్నారు.


