అనంతగిరి: ‘మద్యం మత్తులో గ్రామంలో గొడవలు జరుగుతున్నాయి. యువత పెడదారి పడుతోంది. అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబాలు వీధిన పడుతున్నాయి. గ్రామంలో వెంటనే మద్యం విక్రయాలు నిషేధించాలి’ అని వికారాబాద్ మున్సిపల్ పరిధి ధన్నారం గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన గ్రామసభలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. మద్యం మత్తులో జీవితాలు ఆగం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం నిషేధించామని, నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మద్యం అమ్మితే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని, కొనుగోలు చేసిన వారికి రూ.2 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో ఎకై ్సజ్, పోలీసు శాఖలు సహకరించాలని కోరారు.


