● ప్రమాదపుటంచున ప్రయాణం
● కూలిన అన్నాసాగర్ బ్రిడ్జి రేలింగ్..
● శిథిలావస్థలో కోట్‌పల్లి వంతెన సైడ్‌వాల్స్
బంట్వారం: రహదారులను అభివృద్ధి చేసి, రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగు పరుస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా.. వాస్తవరూపం దాల్చడం లేదు. కొత్తమార్గాలు, విస్తరణ సంగతి ఎలా ఉన్నా.. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వలన అధ్వాన రోడ్లు, శిథిలావస్థకు చేరువన వంతెనలు, ఇరు వైపులా ఉన్న రేలింగులు సైతం మరమ్మతుకు నోచుకోవడం లేదు. దీంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తప్పనిసరిగా ప్రమాదపుటంచున ప్రయాణిస్తున్నారు.
40 ఏళ్ల క్రితం..
కోట్‌పల్లి మండల కేంద్రంలోని తాండూరు– సదాశివపేట మార్గంలోని వాగుపై సుమారు 40 ఏళ్ల క్రి తం వంతెన నిర్మించారు. అదే సమయంలో అన్నాసాగర్ వాగుపై కట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. కాలక్రమేణా రెండు బ్రిడ్జిలకు ఇరు వైపులా ఉన్న సైడ్ రేలింగ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. పెచ్చులు ఊడుతున్నాయి. అయినప్పటికీ ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదు.
అదుపు తప్పితే..
తాండూరు– సదాశివపేట రహదారి వేలాది వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. సిమెంటు, నాపరాయి లోడ్‌తో వాహనాలు ఈ మార్గం గుండా సదాశివపేట జాతీయ రహదారి 9 వైపు వెళ్తుంటాయి. కోట్‌పల్లి ప్రాజెక్టుకు టూరిస్టులు తమ వ్యక్తిగత వాహనాలతో దూసుకుపోతుంటారు. ఈ క్రమంలో ఈ రెండు వంతెనల వద్ద ఏమాత్రం ఆదమర్చినా ప్రమాదం బారిన పడే అవకాశాలు లేకపోలేదు. అన్నాసాగర్ వంతెనపై రక్షణగా ఉన్న రేలింగ్ ఎక్కడికక్కడ ఊడిపోగా.. కోట్‌పల్లి బ్రిడ్జి పై కూలడానికి సిద్ధంగా ఉంది. ఈ దారిలో ప్రయాణించాలంటే ద్విచక్ర వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా.. వాగులో పడాల్సిందేనని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, ప్రమాదాలు జరగముందే రేలింగుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


