ర్యాండమైజేషన్‌తో లబ్ధిదారుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ర్యాండమైజేషన్‌తో లబ్ధిదారుల ఎంపిక

Jun 7 2026 9:18 AM | Updated on Jun 7 2026 9:18 AM

ర్యాండమైజేషన్‌తో లబ్ధిదారుల ఎంపిక

అర్హులైన వారికే కేటాయింపు

కలెక్టర్‌ దీపక్‌ తివారి

అనంతగిరి: డబుల్‌ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో తాండూరు నియోజకవర్గంలో డబుల్‌ బెడ్రూం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై కలెక్టర్‌ దీపక్‌ తివారి, అదనపు కలెక్టర్‌ వెంకటాచారి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రాథోడ్‌ దశరథ సింగ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి సమక్షంలో ర్యాండమైజేషన్‌ ప్రక్రియలో ఇళ్ల కేటాయింపుపై కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గంలో 8,333 దరఖాస్తులు వచ్చాయని, 1,001 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం 581 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఎంపికై న లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హత ఉన్నవారికే కేటాయింపు ఉంటుందని వివరించారు. అర్హత లేకుండా ఇళ్ల కేటాయింపు జరిగిందని తెలిస్తే ఫిర్యాదులను స్వీకరించి మరో దఫా విచారణ చేపడతామన్నారు.

గ్రామాల అభివృద్ధికి కృషి చేయండి

పరిగి: గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి ప్రజాప్రతినిధులకు సూచించారు. శనివారం మండల పరిధిలోని జాఫర్‌పల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక గ్రామసభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గ్రామ సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న క్రమంలో గ్రామాల్లో మురుగు కాల్వలను శుభ్రం చేసుకోవాలని, గుంతలను పూడ్చుకోవాలని సూచించారు. గ్రామ సమస్యల పరిష్కారం, ప్రజలకు అందించాల్సిన మౌలిక సదుపాలపై ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చూడాలని చెప్పారు. అనంతరం రాఘవపూర్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి కొనుగోళ్లను వేగిరం చేయాలన్నారు. మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా అన్‌లోడ్‌ చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సుదర్శన్‌, జిల్లా మేనేజర్‌ మోహనకృష్ణ, డీపీఓ జయసుధ, తహసీల్ధార్‌ వెంకటేశ్వరి, ఎంపీడీఓ హరిప్రియ రెడ్డి, సర్పంచ్‌ మహేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement