కొడంగల్: యాసంగి సీజన్ పంటల కోతలు పూర్తయ్యాయి. వానాకాలం సీజన్‌కు రైతులు సమాయత్తం అయ్యారు. అందులో భాగంగా యాసంగి పంట వ్యర్థాలను పొలంలో దుక్కిదున్నకుండా కాల్చి బూడిద చేస్తున్నారు. ఫలితంగా భూసారం దెబ్బతిని, పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు నశించిపోతున్నాయి. పంటకు నష్టం చేకూరుతుంది. దీనిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. వ్యర్థాలను కాల్చడం చట్టరీత్యా నేరమని హెచ్చరించింది. జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. పోస్టర్లను ఆవిష్కరించింది.
అవగాహన కార్యక్రమాలు
ఇటీవల కాలంలో చాలామంది రైతులు పొలంలోని పంట వ్యర్థాలను కాలుస్తున్నారు. అయితే కొందరు ప్రమాదశాత్తు ఆ అగ్నికీలల్లో చిక్కుకొని మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. వ్యర్థాలుకాల్చడం వలన భూసారం తగ్గే ప్రమాదం ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న వ్యవసాయ శాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. వ్యర్థాలను పొలంలో కలియ దున్నడంతో కలిగే లాభాలు,కాల్చడంతో వచ్చే నష్టాల గురించి ఆ శాఖ అధికారులు వివరిస్తున్నారు. వ్యర్థాలను కాలిస్తే రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమాన విధిస్తామని స్పష్టం చేస్తున్నారు.
అవశేషాలను కాల్చితే..
పంట కోసిన తర్వాత పొలంలో మిగిలిన అవశేషాలను కాలిస్తే పంటలకు మేలు చేసే మిత్ర సూక్ష్మజీవులు చనిపోతాయని అధికారులు చెబుతున్నారు. భూమిలో సహజ పోషకాలు, సూక్ష్మజీవులు నశించి.. నేల నాణ్యత తగ్గిపోతుందని తెలిపారు. పోషకాలు ఆవిరైపోతాయి. ఫలితంగా ఎరువుల వినియోగం పెరిగి పెట్టుబడి భారమవుతుంది. విష వాయువులు పెరిగి వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ప్రజలకు శ్వాసకోశ, కంటి, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశంఉందని వివరిస్తున్నారు.
కలియ దున్నితే..
వ్యర్థాలను పొలంలో దున్నడం వలన భూసారం మెరుగుపడుతుంది. నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. పొలంలో నీటి వినియోగం, రసాయన ఎరువుల అవసరం తగ్గుతుంది. పంటలకు మేలు చేసే మిత్ర సూక్ష్మజీవులు పెరిగి, పంట దిగుబడి పెరుగుతుంది. పచ్చిరొట్ట ఎరువును కల్టివేటర్‌తో భూమిలోనే కలియదున్నడంతో వ్యర్థాలు పూర్తిగా కలిసి, భూమికి బలం చేకూరుతుంది.


