బొంరాస్‌పేట: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిట్టడానికే సీఎం రేవంత్‌రెడ్డి కోట్ల నిధులు ఖర్చుచేసి ప్రజాపాలన సభలు నిర్వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి బీఆర్‌ఎస్ పుణ్యమే అన్నారు. జడ్చర్ల సభలో సీఎం పచ్చి అబద్దాలు మాట్లాడారని విమర్శించారు. కేసీఆర్ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును రూ.27వేల కోట్ల నిధులతో 90 శాతం పనులు పూర్తి చేశారన్నారు. ఐదు రిజర్యాయర్లు, వాటికి మోటార్లు ఏర్పాటు చేశారని వివరించారు. క్రాప్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం నారాయణపేట ఎత్తిపోతల పథకం ఎలా సాధ్యమో చెప్పాలన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ వద్ద కేసీఆర్ చేపట్టిన పనులను పూర్తి చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. శ్రీశైలం, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టుల ఆయకట్టును ఉపయోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా రేవంత్‌రెడ్డి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు.
ఎస్‌ఐపై డీజీపీకి ఫిర్యాదు చేస్తా
ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నా కేసు నమోదు చేయడంలేదని స్థానిక ఎస్‌ఐ, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ట్రాక్టర్లు, జేసీబీలను పట్టుకున్నా డీలింగ్ కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఇసుక బండ్లను సీజ్ చేయాలన్నారు. కేసు నమోదు చేయకుంటే ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎస్‌ఐ బాలవెంకటరమణపై త్వరలోనే డీజీపీకి ఫిర్యాదు చేస్తానన్నారు.
విత్తనాల స్కామ్‌లని ఆరోపణ
కొడంగల్ నియోజకవర్గంలో సబ్సిడీ విత్తనాల స్కామ్‌లు జోరుగా సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.7 కోట్ల విలువైన వేరుశనగ విత్తనాలు, 617 మంది రైతులకు చెందిన 4.5కోట్ల కందుల స్కామ్ చోటుచేసుకుందని ఆరోపించారు. ఎర్రమట్టి, ఇసుక రవాణా, విత్తనాల స్కామ్‌లు జోరుగా సాగుతున్నాయని వీటిని అరికట్టకపోతే పార్టీ తరపున పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు మహేందర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు శేరి నారాయణరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, శ్రావణ్‌గౌడ్, నెహ్రూనాయక్, సర్పంచ్‌లు మల్లారెడ్డి, హీరూనాయక్, బాలు నాయక్, మహేందర్, వెంకటయ్య, లచ్చప్ప, విష్ణువర్ధన్‌రెడ్డి, చాంద్‌పాషా, సురేశ్‌రాజ్, తదితరులున్నారు.
పాలమూరు–రంగారెడ్డి బీఆర్‌ఎస్ పుణ్యమే
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి


