తాండూరు: నకిలీ విత్తన వ్యాపారానికి జిల్లా అడ్డాగా మారింది. సరిహద్దున ఉన్న కర్ణాటకకేంద్రంగా అక్రమార్కులు యథేచ్ఛగా తమ దందాను కొనసాగిస్తున్నారు. నిరంతరం పోలీసులు నిఘా పెట్టినా.. దందా జోరు పెంచి, సవాల్‌గా మారుతున్నారు. పక్షం రోజుల వ్యవధిలో పోలీసు శాఖ నకిలీ విత్తనాలను తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి, సరుకును స్వాధీనం చేసుకుంది. నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసి, వాటి బారి నుంచి రైతులను రక్షించేందుకు ఎస్పీ స్నేహామెహ్ర పటిష్టమైన చర్యలు చేపట్టారు.
చెక్‌పోస్టులతో దందాకు చెక్
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు శాఖ టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. పరిగి, తాండూరు, వికారాబాద్‌లలో పోలీసు సబ్ డివిజన్‌లున్నాయి. ప్రతి సబ్ డివిజన్‌కు ఒక టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఒక ఎస్‌ఐ, కానిస్టేబుల్‌లు సభ్యులుగా ఉన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. నిరంతరం తనిఖీలు చేపట్టారు. తాండూరు సబ్ డివిజన్ పరిధి కొత్లాపూర్ బార్డర్ చెక్‌పోస్ట్, పరిగి సబ్ డివిజన్ పరిధి రావల్‌పల్లి చెక్‌పోస్ట్, వికారాబాద్ సబ్ డివిజన్ పరిధి తోర్మామిడిలో చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.
బడా రైతులతో ఒప్పందం
సీజన్ మొదలు కర్ణాటక రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల నుంచి కొందరు కేటుగాళ్లు నకిలీ విత్తనాలు, ఎరువులను దిగుమతి చేసుకొని రైతులకు అంటగడుతుంటారు. ఇక్కడి బడా రైతులతో ఒప్పందం చేసుకొని, మాయమాటలతో చిన్నసన్నకారు రైతులకు విక్రయిస్తుంటారు. ఫలితంగా వారికి తగిన ప్రతిఫలం అందజేస్తారు.
ఎరువుల దుకాణాలపై దృష్టి
వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు విక్రయాలు జరగకుండా పోలీసు శాఖ టాస్క్‌ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసింది. ఇందులో మండల, జిల్లా స్థాయి టీంలలో పోలీసు అధికారులు, వ్యవసాయ అధికారులు కొనసాగుతున్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు సరిహద్దుతో పాటు.. జిల్లాలోని విత్తన, ఎరువుల విక్రయ దుకాణాలపై నజర్ పెట్టింది. సంయుక్తంగా తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
టాస్క్‌ఫోర్స్ కమిటీల ఏర్పాటు
మండల నుంచి జిల్లా వరకు ప్రత్యేక బృందాలు
కర్ణాటక సరిహద్దులో 3 చోట్ల చెక్‌పోస్టులు
ఎరువులు, విత్తన దుకాణాలపై తనిఖీలకు సిద్ధం


