మాజీ మంత్రి సబితారెడ్డి
అనంతగిరి: వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి సబితారెడ్డి శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. వికారాబాద్ పర్యటనలో ఉన్న ఆమె ఆనంద్ నివాసానికి వెళ్లి శాలువా కప్పి బర్త్‌డే విషెష్ తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
షాద్‌నగర్: నందిగామ మండల పరిధిలోని చేగూరు గ్రామ శివారులో ఉన్న విద్యుత్ ఉప కేంద్రంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ పరికరాలను చోరీ చేశారు. ఉప కేంద్రంలో ఉన్న ఐదు కాపర్ రాడ్లు దొంగిలించినట్లు, వీటి విలువ సుమారు రూ.8 లక్షల వరకు ఉంటుంది. ఉప కేంద్రం సబ్ ఇంజనీర్ సందీప్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ ప్రసాద్ తెలిపారు.
మొయినాబాద్ రూరల్: ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి శుక్రవారం మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. బాకారానికి చెందిన ఈర్లపల్లి లక్ష్మణ్‌రావు(55) కూలీ పనులు చేస్తుంటాడు. గురువారం పనికి వెళ్లిన లక్ష్మణ్‌రావు పొలంలోని ట్రాక్టర్‌ను నడిపేందుకు ప్రయత్నించగా, అదుపుతప్పి కిందపడిపోయాడు. పైనుంచి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్ర గాయాలైన అతన్ని భాస్కర ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి భార్య సీతామహాలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లికార్జున్ తెలిపారు.
మొయినాబాద్‌రూరల్: డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మండలంలోని తోల్‌కట్ట గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉండే సాంఘిక సంక్షేమ కళాశాల(వికారాబాద్)లో కుందేటి కల్పన(20) డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుంది. గురువారం ఆమె తన అక్కను ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పి బయలు దేరింది. శుక్రవారం అయినా సోదరి ఇంటికి రాకపోవడంతో సాధ్యమైన అన్ని చోట్ల వెతికారు. కానీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు.
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
మాదాపూర్: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కోరారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న త్రెడ్ పోచంపల్లి ప్రదర్శనను శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ప్రారంబించారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల .. మాట్లాడుతూ తెలంగాణకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చిన పోచంపల్లి ఇకత్ కళావైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో ప్రదర్శనను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేత కుటుంబాలకు మద్దతు అందించాలని కోరారు.ఈ సందర్భంగా పోచంపల్లి ప్రాంతీయ వంటకాలతో ఆహార స్టాళ్ళు ఏర్పాటు చేశారు. ఆధునిక ఏఐ ఎక్సిపీరియన్స్ బూత్ ప్రదర్శన ఆకర్షణగా ఉంది. సందర్శకులు వర్చువల్‌గా పోచంపల్లి ఇకత్ దుస్తులను ధరించి ఆ అనుభూతిని పొందే అవకాశం కల్పించారు.


