పరిగి: పార్టీ శ్రేణులపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, రైతుల పక్షాన నిలబడి, పోరాటం చేస్తానని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. యూరియా కొరత నేపథ్యంలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేతో పాటు.. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులపై కేసులు నమోదు కాగా.. శుక్రవారం వారు పరిగి కోర్డుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడారు. బీఆర్‌ఎస్ అంటేనే రైతుల పక్షపాతి అని, తమ హయాంలో అన్నదాతల కోసం కేసీఆర్ ఎన్నో పథకాలను తెస్తే.. కాంగ్రెస్ అమలు చేయడం లేదని ఆరోపించారు. పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్.. ఏనాడు రైతులను ఇబ్బంది పెట్టలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కర్షకులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పంట సాగు చేయడం కంటే.. దిగుబడిని విక్రయించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్‌ఎస్.. గ్రామానికో వరి కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తే.. ఇప్పుడు కనీసం 50శాతం కూడా సేకరించకపోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. రైతులకు ఏ చిన్న కష్టం వచ్చినా.. బీఆర్‌ఎస్ ముందుండి పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆంజనేయులు, ప్రవీణ్‌రెడ్డి, అరవింద్‌రావు, ముకుంద అశోక్, సురేందర్, రవికుమార్, మాణిక్యం పాల్గొన్నారు.
కేసులకు భయపడేది లేదు
రైతు పక్షపాతి బీఆర్‌ఎస్
మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి


