యాలాల: ఈతకు వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం బస్తాపూర్‌కు చెందిన రహమత్(28)తో పాటు పాత తాండూరు వాసి మొయిజొద్దీన్‌లు బుధవారం సాయంత్రం కోకట్ కాగ్నా నదిలో ఈతకు వెళ్లి, మునిగిన సంగతి విధితమే. అందులో మొయిజొద్దీన్ మృతదేహం అదే రోజు లభ్యం కాగా.. రహమత్ ఆచూకీ లేకుండా పోయింది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, తాండూరు అగ్ని మాపక సిబ్బంది బుధవారం చీకటి పడేంతవరకు నదిలో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. కాగా.. గురువారం తెల్లవారుజాము నుంచి మరలా గాలింపు చేపట్టగా.. రహమత్ మృతదేహం లభ్యమైంది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


