నేటి నుంచి అమలులోకి రానున్న పెరిగిన భూముల మార్కెట్ విలువ
బషీరాబాద్: పెరిగిన భూముల మార్కెట్ విలువ శుక్రవారం నుంచి అమలులోకి రానుంది. దీంతో అదనపు రిజిస్ట్రేషన్ వ్యయం తప్పదనే భావనతో గురువారం బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం భూ క్రయవిక్రయదారులతో కళకళలాడింది. జోరుగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. కొనుగో లు, అమ్మకాల లావాదేవీలను పాత ధరకే పూర్తి చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
45 నిమిషాలు..
పెరిగిన ధరలు అమల్లోకి రాకముందే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని రైతులు, భూ యజమానులు, కొనుగోలు దారులు కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. గురువారం ఒక్కరోజే సుమారు 25 స్లాట్లు బుక్ కాగా, 12 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. సాధారణంగా 15 నిమిషాల్లో పూర్తయ్యే ప్రక్రియ.. రద్ది కారణంగా 45 నిమిషాల వరకు సాగింది. పలువురు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.
75 శాతం నుంచి..
మండలంలోని కాశీంపూర్, ఇందర్‌చేడ్, నవంద్గీ గ్రామాల్లో ప్రస్తుతం ఎకరాకు రూ.3.37 లక్షలుగా ఉన్న భూముల మార్కెట్ విలువపై సుమారు 75 శాతం పెంచినట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని గ్రామాల్లో రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు డిప్యూటీ తహసీల్దార్ రుక్సాన వెల్లడించారు.
పెరగనున్న ఆదాయం
భూముల విలువ పెంపుతో రిజిస్ట్రేషన్ సమయంలో వసూలు చేసే 7.5 శాతం స్టాంప్ డ్యూటీతో పాటు ఇతర రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరనుంది. భూముల విలువ పెరిగిన కొద్దీ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. పెరిగిన మార్కెట్ విలువ అమలులోకి రావడంతో భూముల కొనుగోలు, అమ్మకాలపై అదనపు భారం పడనుంది. రానున్న రోజుల్లో కొత్త ధరల ప్రభావం రిజిస్ట్రేషన్లపై స్పష్టంగా కనిపించే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
చివరి రోజు తహసీల్దార్
కార్యాలయంలో సందడి
7.5 శాతం స్టాంప్ డ్యూటీతో ప్రభుత్వానికి అదనపు ఆదాయం


