షాబాద్: క్యారెట్ సాగులో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు హార్టికల్చర్ శాస్త్రవేత శ్రీకృష్ణ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని లక్ష్మరావుగూడలో సేవా స్ఫూర్తి ఫౌండేషన్, ఉద్యాన శాఖ క్రిడా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో క్యారెట్ సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యారెట్ పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే సరైన భూసిద్ధం, అనువైన రకాల ఎంపిక, సమతుల్య ఎరువుల వినియోగం, నీటి పారుదల నిర్వహణ, కలుపు నియంత్రణ శాసీ్త్రయ యాజమాన్య పద్ధతులను పాటించాలని రైతులకు సూచించారు. వర్షాధార పరిస్థితుల్లో నల్లరేగడి నేలల్లో క్యారెట్ సాగు చేసే రైతులు నీటి నిల్వ లేకుండా డ్రైనేజీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. హార్టికల్చర్ అధికారి కీర్తి కృష్ణ మాట్లాడుతూ.. ఉద్యానశాఖ ద్వారా రైతులకు అందుతున్న సేవలు, పథకాలు, సాంకేతిక సూచనలు చేశారు. సరైన మొక్కల మధ్య దూరం, సమగ్ర చీడపీడల నివారణ చర్యలను రైతులకు వివరించారు. సేవా స్ఫూర్తి పౌండేషన్ ప్రాజెక్డ్ మేనేజర్ రత్నాకర్ మాట్లాడుతూ.. నేల ఆరోగ్య పరిరక్షణ, సేంద్రియ ఎరువుల వినియోగం, లోతైన దుక్కి, సమతుల్య పోషక నిర్వహణ, శాసీ్త్రయ సాగు పద్ధతుల ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. రైతులు శాసీ్త్రయ పద్ధతులను అవలంబించి క్యారెట్ సాగును లాభదాయకంగా మార్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీరంగపూరం కుమార్, రైతులు శ్రీనివాస్, మాణిక్యం, రామకృష్నారెడ్డి, పెంటారెడ్డి, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


