నేడు గ్రామసభలు | - | Sakshi
Sakshi News home page

నేడు గ్రామసభలు

Jun 4 2026 7:27 AM | Updated on Jun 4 2026 7:27 AM

తాండూరు రూరల్‌: మండల పరిధిలోని తొమ్మిది గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ విశ్వప్రసాద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో అల్లాపూర్‌, బెల్కటూర్‌, చంద్రవంచ, చింతమణిపట్నం, కరన్‌కోట్‌, ఓగిపూర్‌, వీరారెడ్డిపల్లి, రాంపూర్‌మీదితండా, సిరిగిరిపేట్‌ గ్రామాల్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అన్ని విభాగాలకు సంబంధించి అంశాలపై గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఒక్కో గ్రామానికి మండల ప్రత్యేకాధికారితో పాటు గ్రామ కన్వీనర్‌ ఉంటారని చెప్పారు.

ప్రారంభమైన ఉర్సు ఉత్సవాలు

యాలాల: మండల కేంద్రంలోని నౌషా బాలేసాబ్‌ దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అయిన మంగళవారం రాత్రి గంధం ఊరేగింపు ప్రక్రియను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల నుంచి గంధంతో పాటు చాదర్‌ను మైనార్టీ నాయకులు, దర్గా కమిటీ సభ్యులు తీసుకువెళ్లారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బుధవారం రాత్రి దీపారాధన, గురువారం జ్యారత్‌తో ఉర్సు ఉత్సవాలు ముగియనున్నాయి. కార్యక్రమంలో కోఆప్షన్‌ సభ్యుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు అక్బర్‌బాబా, దర్గా కమిటీ అధ్యక్షుడు గంతల మైనోద్దీన్‌, కమిటీ సభ్యులు గఫార్‌, ఆరిఫ్‌, రజాక్‌, ఖాజాబేగ్‌, అక్రం, హసన్‌ ఖాన్‌ తదితరులు ఉన్నారు.

ముగిసిన బీపీఎల్‌ టోర్నీ

బషీరాబాద్‌: కిషన్‌ ప్రసాద్‌ మెమోరియల్‌ బీపీఎల్‌(బషీరాబాద్‌ ప్రీమియర్‌ లీగ్‌) క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఎస్‌కేబీ జట్టు విజేతగా నిలిచింది. బషీరాబాద్‌ మండలంలోని 14 క్రికెట్‌ జట్లు గత మూడు వారాలుగా తలపడ్డాయి. బుధవారం టోర్నమెంట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఎస్‌వీకే జట్టు విజయ కేతనం ఎగరవేసింది. విజేత జట్టుకు ట్రోఫీతో పాటు రూ.45 వేల నగదు బహుమతిని, రన్నరప్‌ జట్టు రాయల్స్‌కు ట్రోఫీ, రూ.25 వేల నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్‌బీఎల్‌ఓ సీఈఓ బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి ట్రోఫీలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో అజయ్‌ప్రసాద్‌, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు జానకి, నాయకులు అనూప్‌ ప్రసాద్‌, ఆర్‌ఎంపీ డాక్టర్‌ నర్సింలు, సతీష్‌, శ్రీకాంత్‌, రియాజ్‌, నరేష్‌, రఘు, సూర్య, జగదీశ్‌, రాము, సత్తర్‌, ఇషాక్‌, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ షాక్‌తో గేదె, దూడ మృతి

కొడంగల్‌: పట్టణ శివారులో బుధవారం విద్యుత్‌ షాక్‌తో గేదె, దూడ చనిపోయాయి. పసుల అర్జునప్పకు చెందిన రెండు పశువులపై మెడికల్‌ శ్రీనివాస్‌ పొలం దగ్గర కరెంటు స్తంభం విరిగి పడిందని గొర్రెల పెంపకం దారుల సంఘం కొడంగల్‌ కార్యదర్శి మనిగిరి రమేష్‌ తెలిపారు. బాధితుని కుటుంబం బర్రెల పాలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారని అన్నారు. పశువు చనిపోవడం వల్ల ఆయన కుటుంబం పోషన కష్ట్టంంగా మారుతుందన్నారు. అధికారులు స్పందించి బాధితునికి న్యాయం చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement