● సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి
● పీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్,
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సర్ పేరుతో కాంగ్రెస్ ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తోందని పీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్, పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం పట్టణంలో నియోజకవర్గంలోని బూత్ లెవల్ ఏజెంట్లకు సర్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో సర్ పేరుతో ఓట్లను తొలగించడంతోనే బీజేపీ అఽధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఇదే తరహాలో మన రాష్ట్రంలో అడ్డదారిన అధికారంలోకి వచ్చేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సర్ ప్రక్రియను రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కును హరించే చర్యలను కాంగ్రెస్ పార్టీ సహించబోదని స్పష్టం చేశారు. సర్ ప్రక్రియలో ఎలాంటి మోసాలు జరిగినా వెంటనే పీసీసీ దృష్టికి తేవాలని నాయకులకు సూచించారు. అలాగే 18 సంత్సరాలు నిండిని ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ట్రైనర్లు రాఘవేందర్‌రెడ్డి, రాజేష్, మోహన్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


