● ప్రశాంత వాతావరణంలో
పండుగలు జరిగేలా చూడాలి
● ఎస్పీ స్నేహ మెహ్ర
తాండూరు టౌన్: బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేయాలని ఎస్పీ స్నేహ మెహ్ర ఆదేశించారు. బుధవారం తాండూరు పట్టణ పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, మైనర్లపై జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సీసీ కెమెరాలు, సాంకేతికత ద్వారా నేరగాళ్లను అదుపు చేయాలన్నారు. రాత్రి వేళల్లో ముమ్మర గస్తీ నిర్వహించాలని, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టాలన్నారు. పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని, రానున్న బోనాలు, మొహర్రం వేడుకల సందర్భంగా గట్టి భద్రత ఏర్పాటు చేయాలన్నారు. ఠాణాలో రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. అంతకు ముందు ఎస్పీ పట్టణ పోలీసు స్టేషన్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ పరమేశ్వర్, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.


