పూడూరు: పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా క్రాంతి కుమార్‌ను నియమిస్తూ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం నిమామకపత్రాన్ని అందజేశారు. మండల పరిధిలోని పెద్ద ఉమ్మెంతాల్ గ్రామానికి చెందిన బి.క్రాంతి కుమార్ పార్టీ కార్యక్రమాల్లో, సామాజిక కార్యక్రమాల్లో చేసిన సేవలను గుర్తించి తనకు పదవిని ఇచ్చారని అన్నారు. గ్రామాల్లో బడుగుబలహీన వర్గాలతో పాటు ఎస్సీ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. పని చేసే వారికి కాంగ్రెస్‌లో ఎల్లప్పుడు గుర్తింపు ఉంటుందని అన్నారు. తనపై నమ్మకంతో పదవిని కట్టబెట్టిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలో పని చేస్తున్న జర్నలిస్టులందరికీ ఫ్యూచర్‌సిటీలో ఇంటి స్థలాలు కేటాయించాలని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు మంగళవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధరాబాబుకు విన్నవించారు. సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేరిబాయి గణేష్, మైల సైదులు, కోషాధికారి వడ్ల శ్రీనివాసచారి ఆధ్వర్యంలో మంత్రికి వినతి పత్రం అందేజేశారు. రాష్ట్ర ఆవిర్భావ సంబురాల్లో భాగంగా విచ్చేసిన మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కలెక్టర్ నారాయణరెడ్డిని కలిశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అర్హులైన జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు, జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ, ప్రభుత్వ అధికారుల హెల్త్ స్కీం జాబితాలో జర్నలిస్టులను చేర్చాలని, అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు.
వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్
కొడంగల్: ఎన్నికల ముందు కాంగ్రెస్ దివ్యాంగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయలాని వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్, ప్రధాన కార్యదర్శి కావలి నర్సింలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు అరగుండు కొట్టుకుని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దివ్యాంగులపై సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం తహసీల్దార్ రాంబాబుకు వినతిపత్రం అందజేశారు.
తాండూరు రూరల్: ప్రభుత్వం.. పేదలకే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కుతున్నాయని బీఆర్‌ఎస్ పెద్దేముల్ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ ఆరోపించారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని విమర్శించారు. పెద్దేముల్‌లో నాలుగు అంతస్థుల భవనం ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని, ఈ విషయం ఇక్కడి ప్రజలకు తెలుసునని చెప్పారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఐక్యంగా ఉండి, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ డీవై నర్సిములు, ఉప సర్పంచ్ డీవై ప్రసాద్, నాయకులు రమేష్, జనార్దన్‌రెడ్డి, వీరప్ప, వెంకటేశ్ చారి, పాండు, అంజిలయ్య, శ్రీను ఉన్నారు.


