విత్తన పంపిణీలో గోల్‌మాల్‌! | - | Sakshi
Sakshi News home page

విత్తన పంపిణీలో గోల్‌మాల్‌!

Jun 3 2026 6:42 AM | Updated on Jun 3 2026 6:42 AM

దుద్యాల్‌: రైతులకు ప్రభుత్వం ఉచితంగా అందజేసిన వేరుశనగ విత్తనాలపై సమగ్ర విచారణ చేపట్టాలని బీఆర్‌ఎస్‌ యువజన విభాగం అధ్యక్షుడు బొగమోని సురేశ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం మండల పరిధిలోని లగచర్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో రైతులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు వేరుశనగ విత్తనాలను ప్రభుత్వం కేటాయించింది. వీసీసీ(వాల్యూ చైన్‌ క్లస్టర్‌) ద్వారా వందశాతం ఉచితంగా, ఎమ్‌ఎల్‌డీ(బ్లాక్‌ లెవెల్‌ డెమాన్‌స్ట్రేషన్‌) ద్వారా 50 శాతం సబ్సిడీతో పంపిణీ చేయాలి. అయితే ఈ విత్తనాలకు కొంత మంది రైతులకు ఇచ్చి మిగతా విత్తనం అంత అమ్ముకున్నట్లు బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. దుద్యాల్‌, గౌరారం, ఈర్లపల్లి, పోలేపల్లి, కుదురుమల్ల, లగచర్ల, హస్నాబాద్‌, హంసంపల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులకు వేరుశనగ విత్తనాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు నమోదు చేశారన్నారు. నమోదైన వివరాల గురించి సంబధిత క్లస్టర్ల ఏఈఓలను సంప్రదిస్తే తమకేమీ సంబంధం లేదని ఉన్నతాధికారులకే తెలుసంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తురని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సబ్సిడీ విత్తనాలు రైతులకు అందించానలే ఉద్దేశంతో కేటాయిస్తే అధికారులు అక్రమాలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. సమగ్ర విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ మహేశ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు విష్ణువర్ధన్‌ రెడ్డి, ఆకుల సత్తయ్య, బాలవర్ధన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, రాఘవేందర్‌, వెంకటయ్య, మణికంఠ తదతరులు పాల్గొన్నారు.

లిస్టులో పేర్లు చూసి

రైతులకు ఉచితంగా ఇచ్చిన వేరుశనగ విత్తనాలతో పాటు కంది విత్తనాలు ఇచ్చినట్లు లిస్టులో పేరు చూసి అవాక్కయ్యమని రైతులు వాపోయారు. విత్తనాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు రాయడం సరికాదని మండిపడ్డారు. లగచర్ల గ్రామంలో దాదాపుగా 20 మందికి పైగా రైతులపై విత్తనాలు ఇచ్చినట్లు నమోదు చేశారన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సబ్సిడీ విత్తనాలు రైతువేదికలో నిల్వ ఉంచి రైతులకు అందించాలని, ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రంలో, షాపు గోదాంలో విత్తనాలు ఉంచి ఇలాంటి చర్యలు పాల్పడ్డారని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. లిస్టులో పేర్లు ఉన్న రైతులతో త్వరలో కలెక్టరేట్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఏఈఓపై చర్యలకు డిమాండ్‌

దుద్యాల్‌ క్లస్టర్‌ పరిధిలోని దుద్యాల్‌, గౌరారం, హంసంపల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులు వరి ధాన్యం విక్రయించడానికి ఏఈఓ భావన టోకెన్‌లు ఇవ్వడానికి రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని బీఆర్‌ఎస్‌ నాయకుడు సురేశ్‌ ఆరోపించారు. సంబంధిత ఏఈఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయకుండానే రైతుల పేర్ల నమోదు

అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలకు డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement