దౌల్తాబాద్: చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్లుగా రైతన్నకు వెన్నుదన్నుగా ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) సేవలు విస్తృతం చేసేందుకు గ్రామాలకనుగుణంగా సంఘాలను ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఆయా సంఘాల పరిధి ఎక్కువగా ఉండడం గ్రామాలకు దూరంగా సంఘాలుండడంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. రైతులకు మండల కేంద్రంలో సహకార సంఘం ఉంది. ఈ సంఘం పరిధిలో ఉన్న గ్రామాలు దూరంగా ఉండడంతో భారంగా మారిందని రైతు లు ఆందోళన చెందుతున్నారు. రైతులకు పంటరుణాలు, రాయితీపై విత్తనాలు, ఎరువులందిస్తూ అండగా నిలిచే సహకార సంఘాల విస్తరణ గురించి ప్రభు త్వం పట్టించుకోవాలని రైతులు కోరుతున్నారు.
33 గ్రామాలకు ఒకటే సొసైటీ
మండల పరిధిలో 33 గ్రామాలుండగా ఈ సంఘం పరిధిలో 3,500కు పైగా మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. రైతులు ప్రతీ పంట సీజన్‌లో రుణాలు రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. కొందరు కొత్తగా రుణాలు తీసుకుంటారు. వీటికోసం దూరంలో ఉన్న సొసైటీకి రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. పంటరుణాలు, వ్యాపార రుణాల కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధి సమయంలో సొసైటీకి రాకపోకలు సాగించేందుకు రైతులు పాట్లు పడుతున్నారు.
విభజిస్తే ప్రయోజనం
వ్యవసాయంలో రైతులకు అన్ని రకాలుగా ఉపయోగపడే సహకార సంఘాల సేవలు అందుబాటులోకి రావాలంటే వాటిని విభజించాల్సిన అవసరముందని రైతులంటున్నారు. 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ఏఈఓలను నియమించింది. అదే తరహాలో రైతులకు అందుబాటులో ఉండేలా సొసైటీలను విభజించాలంటున్నారు. సొసైటీలో ఎక్కువ మంది రైతులు సభ్యత్వం కలిగి ఉండగా ఏ అవసరం వచ్చినా వరుస కట్టాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు. పంటల సీజన్ ఆరంభంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు బారులు తీరిన సందర్భాలున్నాయి. పాలన సౌలభ్యం కోసం జిల్లాలు, మండలాలు పునర్విభజన చేసినట్లుగానే రైతులకు మేలు చేకూర్చే సొసైటీల విభజనపై దృష్టి సారించాలని మండల రైతులు కోరుతున్నారు.
నివేదిక పంపించాం
రైతులకు అందుబాటులో ఉండి సేవలందించడమే సహకార సంఘం లక్ష్యం. ఈ సొసైటీ పరిధిలో 33 గ్రామాలు ఉన్నాయి. గోకఫసల్‌వాద్ సొసైటీ ఏర్పాటు చేయాలని కోరడంతో ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు.
– వెంకటేష్, ఇన్‌చార్జి సీఈఓ, దౌల్తాబాద్


