దోమ: మాజీ సర్పంచులను ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని సర్పంచుల సంఘం మండల మాజీ అధ్యక్షుడు రాజిరెడ్డి అన్నారు. బిల్లుల చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం నగరంలోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ప్రభుత్వం ఏర్పాటై రెండున్నర ఏళ్లు గడుస్తున్నా.. బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. నాడు అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి చేశారని, ఇప్పుడు వాటికి వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. ప్రతి ప్రతినిధికి రూ.లక్షల పైనే రావాలని, ప్రభుత్వం చొరవ చూపి వాటిని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా పోలీసులను అడ్డం పెట్టుకొని, పాలన సాగించడం ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటన్నారు.


