● మిల్లు యజమానుల మెలిక
● ధాన్యం సేకరణలో ఇష్టారాజ్యం
● ఇబ్బంది పడుతున్న రైతులు
దోమ: ధాన్యం విక్రయించేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో నెమ్మదించిన సేకరణ, లారీల కొరతతో కుప్పలుగా వడ్ల రాశులు, సంచులు పేరుకుపోయాయి. సమస్య నుంచి గట్టెక్కేందుకు సంబంధిత అధికారులు.. నేరుగా రైస్‌మిల్లులు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టారు. ధాన్యంను మిల్లులో విక్రయించుకోవాలని రైతులకు సూచించారు. దీంతో కొంత ఊరటపొందిన అన్నదాతలు.. తమ ధాన్యాన్ని ట్రాక్టర్లలో మిల్లులకు తరలించగా.. సన్నాలే కొంటాం.. దొడ్డురకం కొనమని మిల్లర్లు మెలిక పెట్టారు. దీంతో ఏం చేయాలో పాలుపోని రైతులు.. మరలాకేంద్రాలకు తరలించడమో.. దళారులను ఆశ్రయించడమో చేస్తున్నారు.
ఆదేశాలున్నా..
కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న జాప్యం నేపథ్యంలో మండల పరిధి బొంపల్లి సమీపంలోని ఎస్‌వీఎస్ రైస్ మిల్లు యాజమాన్యాన్ని ధాన్యం సేకరించాలని అధికారులు చెప్పారు. సన్నాలతో పాటు దొడ్డురకం సేకరించాలని ఆదేశించారు. కానీ మిల్లు యజమాని మాత్రం దొడ్డు వడ్లను నిరాకరించారు. ఎందుకని ప్రశ్నించిన రైతులకు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ.. తిప్పిపంపిస్తున్నట్లు సమాచారం.
అనుకూలమైన వారివే సేకరణ
తమకు అనుకూలమైన రైతుల వడ్లను మాత్రమే కొనుగోలు చేసి, మిగతా వారివి కొనడం లేదని పలువురు ఆరోపించారు. కాదూకూడదు తీసుకోవాలని అన్నవారిని తాలు, తరుగు పేరుతో ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా.. మీ వడ్లు తీసుకుంటే నూకలు అవుతున్నాయని, కొనే ప్రసక్తి లేదంటూ తిప్పి పంపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, మిల్లు యాజమాన్యం ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.లేని పక్షంలో పరిగి– మహబూబ్‌నగర్ ప్రధాన రోడ్డుపై ట్రాక్టర్లను బెట్టి ధర్నా చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.


