సారీ.. నో కేబుల్‌ | - | Sakshi
Sakshi News home page

సారీ.. నో కేబుల్‌

Jun 1 2026 7:35 AM | Updated on Jun 1 2026 7:35 AM

యూజీ విద్యుత్‌ కేబుల్స్‌పై చేతులెత్తేసిన డిస్కం

సాక్షి, రంగారెడ్డి జిల్లా: అండర్‌ గ్రౌండ్‌ (యూజీ) విద్యుత్‌ కేబుళ్ల సరఫరాపై దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం) చేతులెత్తేసింది. కొత్త విద్యుత్‌ కనెక్షన్లలో భాగంగా ఆరు నెలల క్రితమే యూజీ కేబుళ్లు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర మెటీరియల్‌ కోసం పలువురు వినియోగదారులు డీడీ రూపంలో డిస్కంకు డబ్బులు చెల్లించారు. కాగా.. ప్రస్తుత పరిస్థితుల్లో కేబుళ్లు సరఫరా చేయలేమని, మీరే కొనుగోలు చేసుకోవాలని, భవిష్యత్తులో రాబోయే విద్యుత్‌ బిల్లుల్లో సర్దుబాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆయా దరఖాస్తుదారులకు లేఖలు కూడా పంపింది. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి తలెత్తిందని వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

ప్రతి నెలా 30 వేలకుపైగా దరఖాస్తులు

గ్రేటర్‌ జిల్లాల్లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో ప్రస్తుతం 65 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. టీజీఐపాస్‌, టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ప్రతినెలా కొత్త కనెక్షన్ల కోసం 30 వేలకుపైగా దరఖాస్తులు వస్తున్నాయి. వీటిలో చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. కాగా.. ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడుతుండటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోంది. దీంతో ఇప్పటికే ఇళ్ల మధ్య ప్రమాదకరంగా మారిన ఓవర్‌హెడ్‌ (ఓహెచ్‌) లైన్లు స్థానంలో కొత్తగా యూజీ కేబుళ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లోని విల్లాలు, వెంచర్లలోనూ యూజీ కేబుళ్లు వేయాలని ఆదేశాలు జారీ చేయడంతో బిల్డర్లు, యజమానులు కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుదారు సగటున రూ.2 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు డీడీ రూపంలో చెల్లించారు. వీటిలో చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు 350 పైగా ఉండగా, గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లాలు, బహుళ అంతస్తుల భవన నిర్మాణదారులు, వెంచర్‌ నిర్వాహకులు 500 మంది వరకు ఉన్నట్లు అంచనా. ఆరు నెలల క్రితం డబ్బులు చెల్లించినప్పటికీ యూజీ కేబుల్‌ సహా డీటీఆర్‌లను సరఫరా చేయలేదు.

పెరిగిన ధరలతో బెంబేలు

ఆరు నెలల క్రితం దరఖాస్తు సమయంలో మీటర్‌ కేబుల్‌ ధర రూ.1,143 ఉండగా, ప్రస్తుత బహిరంగ మార్కెట్లో రూ.1,843కు చేరింది. పెరిగిన ధరల నేపథ్యంలో కేబుళ్లను సరఫరా చేయలేమని డిస్కం చేతులెత్తేసింది. స్వయంగా కొనుగోలు చేసుకోవాల్సిందిగా ఆయా దరఖాస్తుదారులకు సూచించింది. ఇప్పటికే 100 శాతం డబ్బులు కట్టినవారికి మళ్లీ అదనంగా 10 శాతం సూపర్‌వైజింగ్‌ చార్జీలు సహా మరో 10 శాతం బ్యాంకు గ్యారంటీ చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడం ఎంత వరకు సమంజసమని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు.

ఆరు నెలల క్రితం డీడీ కట్టినా ఫలితం శూన్యం

దరఖాస్తుదారులే కొనుక్కోవాలని ఆదేశం

ఆ మొత్తాన్ని బిల్లులో సర్దుబాటు చేస్తామని ప్రకటన

Advertisement
 
Advertisement
Advertisement