● హెల్త్ కార్డుల పేరిట మోసం చేసిన ప్రభుత్వం
● తపస్ జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్
తాండూరు టౌన్: హెల్త్ కార్డుల జారీ పేరిట ప్రభుత్వం ముందస్తుగా ఉపాధ్యాయుల జీతాల్లో కోత విధించడం సమంజసం కాదని తపస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంగమేశ్వర్, గాజుల బస్వరాజ్ ఆదివారం ఓ ప్రకటనలో ఆక్షేపించారు. హెల్త్‌కార్డుల జారీ విధివిధానాలు, ఆస్పత్రుల యాజమాన్యంతో సమావేశాలు నిర్వహించకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. ఏకంగా ప్రీమియం డబ్బులను ముందుగానే తీసుకోవడమేంటని ప్రశ్నించారు. ఆ డబ్బును వెంటనే తమ ఉద్యోగుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. స్కీం ఇష్టం లేని వారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. దంపతులు ఇద్దరూ ఉద్యోగులైతే ఒకరి నుంచి మాత్రమే ప్రీమియం వసూలు చేయాలని సూచించారు. యువతీ, యువకులకు హెల్త్ కార్డు వర్తించేలా 25 నుంచి 35 సంవత్సరాలకు వయోపరిమితి పెంచాలన్నారు. జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ ఒకే విధమైన ప్రీమియం వర్తింపచేయాలన్నారు.
సందేహాలు తీర్చకుండానే..
యాలాల: ఉపాధ్యాయుల సందేహాలు తీర్చకుండా, డీడీఓల అనుమతి లేకుండా హెల్త్‌కార్డుల ప్రీమియం పేరిట వేతనంలో కోత విధించడం తగదని తపస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒంగోనిబాయి శ్రీనివాస్, శ్రీశైలం అన్నారు. కార్డుల విధి విధానాలు, ఆస్పత్రుల వివరాలు, ఎలాంటి రోగాలకు వైద్యం, ఎంత మేర ఉచిత వైద్యం తదితర అంశాలు తెలపకుండా, డబ్బులు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఏకపక్ష నిర్ణయం మంచిదికాదని హితవు పలికారు.


