● కేంద్రాల్లో కర్షకుల నిరీక్షణ
● వడ్లను ఆరబెడుతూ అక్కడే బస
దుద్యాల్: ‘అన్నదాతలు ఆందోళన చెందవద్దు. కొనుగోళ్లలో వేగం పెంచాం. తడిసిన ధాన్యంతో పాటు.. చివరి గింజవరకు కొనుగోలు చేస్తాం’ అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వాస్తవరూపం దా ల్చడం లేదు. ఇంకా సేకరణ నత్తనడకనే సాగుతోంది. కేంద్రాల్లో ధాన్యం కుప్పలు, తడిసిన గింజలను ఆరబోస్తూ రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొందరు కర్షకులు ఈ బాధలన్నీ భరించలేక చివరకు దళారులను ఆశ్రయిస్తున్నారు. వారు చెప్పిన ధరకు విక్రయిస్తూ నష్టపోతున్నారు.
దళారుల ఇష్టారాజ్యం
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం క్వింటాకు రూ. 2,389లు ఉందని ఆశించిన రైతులకు.. సేకరణలో జరుగుతున్న జాప్యంతో చేసేది లేక ప్రైవేట్ మిల్లర్లు, వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న దళారులు సిండికేటుగా మారి.. అమాంతం ధర తగ్గించేసి ఎండిన వడ్లను క్వింటా రూ. 1,950లకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ మద్దతు ధరతో పోలిస్తే.. రూ.439 తక్కువ. తడిసిన వడ్లను క్వింటాలుకు రూ.1600 నుంచి రూ.1,750ల వరకు సేకరిస్తున్నారు. సర్కారు నిర్లక్ష్యంతో ఆశించిన ధర కష్టమేనని భావించిన కర్షకులు ఇష్టంలేకపోయినా వచ్చిన ధరకు అమ్మేందుకు మక్కువ చూపుతున్నారు. మరి కొందరు ధరలో చాలా వ్యత్యాసం ఉందని, ప్రభుత్వ కొనుగోలుకేంద్రాల్లోనే విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉండగా.. వానాకాలం సీజన్ ప్రారంభం కాబోతోందని, తగిన పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్నామని, యాసంగి వడ్లను త్వరగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.


