చేవెళ్ల: మండలంలోని కమ్మెటలో గత రెండు రోజులుగా గ్రామ దేవతల పూజలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గ్రామస్తులు ఆదివారం బోనాలు ఉత్సవాలు నిర్వహించారు. పూజల్లో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొని అమ్మవార్లను దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ దైవచింతన అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇలాంటి ఉత్సవాలతో ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. గ్రామస్తులందరూ కలిసిమెలసి వేడుకలను జరుపుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం ఉత్సవాలకు విచ్చేసిన అతిథులను నిర్వాహకులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మమ్మకృష్ణగౌడ్, మాజీ సర్పంచ్ హన్మంత్‌రెడ్డి, గ్రామ యువకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, మండలంలోని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.


