యుద్ధమేఘం! | - | Sakshi
Sakshi News home page

యుద్ధమేఘం!

May 31 2026 11:58 AM | Updated on May 31 2026 11:58 AM

నాపరాయిపై

సాక్షి, రంగారెడ్డి జిల్లా: నాపరాయి ఎగుమతులపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇజ్రాయిల్‌ కూటమి– ఇరాన్‌ దేశాల మధ్య నెలకొన్న యుద్ధం తాండూరులోని నాపరాయి పరిశ్రమను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టేసింది. మూడు నెలలుగా ఎగుమతులు లేక ఎక్కడి నిల్వలు అక్కడే ఉండిపోయాయి. ఫలితంగా క్వారీల్లో తవ్వకాలు నిలిచిపోయి.. కూలీలకు పనులు దొరకని పరిస్థితి నెలకొంది. కాలానుగుణంగా (వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా) మార్పు చెందే స్వభావంతోనే నాపరాయి దేశవిదేశీ నిర్మాణ సంస్థలను ఆకర్షిస్తోంది. హర్మూజ్‌ జలసంధి మూతపడటంతో తాండూరు నుంచి నాపరాతి ఎగుమతులు నిలిచిపోయాయి. ఓ వైపు మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక మార్బుల్స్‌, టైల్స్‌తో పోటీపడలేక.. డీలాపడిన నాపరాయి పరిశ్రమపై తాజా పరిస్థితి పుండుమీద కారం చల్లినట్లు తయారైంది. ఇప్పటికే తవ్వి తీసిన రాయి ఎగుమతి కాక.. కొత్తగా తవ్వకాలు లేక.. క్వారీలు ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి.

నిలిచిన మైనింగ్‌

జిల్లాలోని 5,994 ఎకరాల్లో వివిధ రకాల నాపరాయి నిక్షేపాలున్నాయి. వందకుపైగా ఉన్న క్వారీల లీజుదారులు వెలికి తీసిన నాపరాయి నిక్షేపాలను స్థానికంగా ఉన్న లెదర్‌, బ్రష్‌ పాలిషింగ్‌ కేంద్రాలకు తరలిస్తారు. ప్రాసెసింగ్‌ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాలకు ఎగుమతి చేస్తారు. థర్డ్‌ పార్టీ ద్వారా ముంబై, చైన్నె పోర్ట్‌ల మీదుగా దుబాయ్‌, ఇరాన్‌, ఇరాక్‌, ఇజ్రాయెల్‌, సౌదీ అరేబియా సహా జపాన్‌, రష్యా, యూరప్‌, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలకు సైతం ఎక్స్‌పోర్ట్‌ చేస్తుంటారు. ఐదేళ్ల క్రితం రోజుకు 160 నుంచి 200 లారీల నాపరాయి నిక్షేపాలు వెలికి తీయగా, ప్రస్తుతం 40– 50 లారీలకు మించడం లేదు. 500పైగా పాలిషింగ్‌ కేంద్రాల్లో నిల్వలు పేరుకుపోయాయి.

ప్రభుత్వ ప్రోత్సాహం కరువు

నాపరాతి పరిశ్రమకు ప్రభుత్వం నుంచి పెద్దగా ప్రోత్సాహం లేదు. మార్కెట్‌లో డిమాండ్‌ కూడా లేదు. స్థానికంగా రియల్‌ ఎస్టేట్‌ కూడా పడిపోయి, ఆశించిన స్థాయిలో నిర్మాణాలు జరగడం లేదు. మెజార్టీ నిర్మాణదారులు నాపరాయిని పార్కింగ్‌ కోసమే వాడుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం దీన్ని మైనర్‌ మినరల్స్‌ కేటగిరీలో చేర్చగా, మన ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ మేజర్‌ మినరల్‌గానే పరిగణిస్తోంది. పక్కన ఉన్న గుల్బర్గాలో ఎకరం క్వారీ లీజు రూ.3 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వసూలు చేస్తుండగా, అదే ఇక్కడ మాత్రం రూ.12 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది. దీంతో మెజార్టీ పరిశ్రమలు సరిహద్దులోని మిర్యాన్‌కు తరలిపోతున్నాయి.

తడిసి మోపెడు

సరిహద్దులోని కర్ణాటకలో నాపరాతి పరిశ్రమలకు యూనిట్‌ కరెంట్‌ చార్జీ రూ.7.50 ఉండగా, తాండూరులో రూ.11 వసూలు చేస్తున్నారు. రాయల్టీ చెల్లింపులు, నిక్షేపాల వెలికితీత, ప్రాసెసింగ్‌, రవాణా చార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. దీనికి తోడు ఎగుమతులు నిలిచిపోవడంతో రోజూవారీ కూలీలకు సైతం డబ్బులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. టైల్స్‌ వచ్చిన తర్వాత నాపరాయికి డిమాండ్‌ తగ్గింది. ప్రభుత్వ భవనాలకు తాండూరు నాపరాతినే వాడాలని గనులు, పాలిషింగ్‌ యూనిట్ల నిర్వాహకులు, కార్మికులు కోరుతున్నారు.

ఓ గనిలో నాపరాయి తవ్వకాలు

Advertisement
 
Advertisement
Advertisement