సేవలు భారం.. ఖాతాదారులకు శాపం | - | Sakshi
Sakshi News home page

సేవలు భారం.. ఖాతాదారులకు శాపం

May 31 2026 11:58 AM | Updated on May 31 2026 11:58 AM

వికారాబాద్‌: బ్యాంకులకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. చిన్న పని ఉండి వెళ్లినా సగం రోజు అక్కడే గడపాల్సిందే.. జిల్లాలో మొత్తం 87 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. ఇందులో 27(ఎస్‌బీఐ), 12(యూనియన్‌), 6(కెనరా) 5(బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా) 25(తెలంగాణ గ్రామీణ బ్యాంకులు), బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒకటి చొప్పున ఉన్నాయి. 2, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులతోపాటు 7 డీసీసీబీలు, 17 ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి. జిల్లాలో బీసీసీ (బిజినెస్‌ కరస్పాండెంట్‌ సెంటర్లు) ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి 147 ఉండగా.. ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి 868 ఉన్నాయి. సేవల విషయంలో ప్రైవేటు బ్యాంకుల పరిస్థితి మెరుగ్గా ఉండగా ప్రభుత్వ రంగ బ్యాంకులు అధ్వానంగా తయారయ్యాయి. ఎక్కువ మంది ఖాతాలు ఉన్న ఎస్‌బీఐలో సేవల మాత్రం అంతంతే అని చెప్పవచ్చు.

గంటల తరబడి క్యూలోనే..

బ్యాంకుల్లో నగదు లావాదేవీలు చాలా వరకు తగ్గిపోయాయి. పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేయాల్సి ఉన్నా.. బదలాయించాల్సిన సమయంలో మాత్రమే బ్యాంకులకు వెళ్తున్నారు. ఆన్‌లైన్‌ లావాదేవీలపై అవగాహన లేని కొందరు మాత్రమే బ్యాంక్‌ మెట్లు ఎక్కుతున్నారు. ఎక్కువ మంది ఆన్‌లైన సేవలను వినియోగించుకుంటున్నారు. చిన్న మొత్తం అవసరమైన వారు సైతం బీసీఎస్‌(బిజినెస్‌ కరస్పాండెంట్‌ సెంటర్లు)లకు వెళ్లి ఆధార్‌ కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. కొత్త ఖాతాలు తెరిచేందుకు, కేవైసీ, ఫోన్‌ నంబర్‌ అప్‌డేట్‌ చేసుకోవటం కోసం, లోన్లు, రెన్యువల్‌ కోసం మాత్రమే బ్యాంకులకు వెళ్తున్నారు. ఈ సేవలు ఐదు నుంచి పది నిమిషాల్లోనే పూర్తి చేయొచ్చు. కానీ రెండు మూడు గంటల సమయం పడుతుండటంతో ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక లోన్ల కోసం ఎన్ని రోజులు తిరగాలో కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. క్యూలో గంటల తరబడి వేచి చూసి కౌంటర్‌ వద్దకు వెళ్లాక అక్కడ కాదు పక్క కౌంటర్‌కు వెళ్లాలని సూచించటం ఖాతాదారులకు చికాకు తెప్పిస్తోంది. లైన్‌లో ఉన్న వారిని పట్టించుకోకుండా పరిచయం ఉన్న వ్యక్తులు వస్తే వెంటనే పని చేసి పంపుతుండం ఖాతాదారులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ విషయమై తరచూ సిబ్బందితో వాదనకు కూడా దిగుతున్నారు. చదువురాని కష్టమర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కనీసం ఫాం కూడా నింపి ఇవ్వడం లేదు.

మధ్యవర్తులదే హవా

చిన్న చిన్న పనుల కోసం బ్యాంకులకు వెళ్లే సాధారణ జనం ఇబ్బందులు పడుతుండగా పరిచయస్తులు, మధ్యవర్తులు వస్తే మాత్రం సకల మర్యాదలు చేసి వారి పనులు చేసి పంపుతున్నారు. మొండి బకాయిలలో వన్‌ టైం సెటిల్‌ మెంట్లు, ఆయా రకాల రుణాలు, పంట రుణాలు, రుణాల రెన్యువల్‌ లాంటి సేవలు పొందాలంటే మధ్యవర్తులతో వెళ్తేనే పనులు అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి బ్యాంకులో ఐదారుగురు మధ్యవర్తులు కనిపిస్తుండగా రైతులకు రుణాలిచ్చే విషయంలో మాత్రం గ్రామానికి ఇద్దరు ముగ్గురు బ్రోకర్లు తయారయ్యారు. వీరు కమీషన్లు తీసుకుని రుణాలిప్పిస్తున్నారు. బ్యాంక్‌ అధికారులకు సైతం వాటా ఇవ్వాలని బయట చెప్పుకుంటున్నారు. ఇలా విసిగి పోయి చాలా వరకు ఇటీవలి కాలంలో ప్రైవేటు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు.

బ్యాంకుల్లో నిత్యం భారీ క్యూలు

ఐదు నిమిషాల పనికి గంటల తరబడి పడిగాపులు

జిల్లాలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 87, ప్రైవేటువి 17

Advertisement
 
Advertisement
Advertisement