ఆవిర్భావ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఆవిర్భావ వేడుకలు

May 31 2026 11:58 AM | Updated on May 31 2026 11:58 AM

ఆవిర్భావ వేడుకలు

ఘనంగా నిర్వహిద్దాం

అనంతగిరి: రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని, ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లాస్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్‌ 2న జరిగే ఆవిర్భావ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టరేట్‌ మైదానాన్ని వేడుకలకు సిద్ధం చేయాలని సూచించారు. అతిథులకు ఆహ్వాన పత్రాలు పంపాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఆయా శాఖల ప్రగతిని తెలియజేసేలా స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటాచారి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌, ఆర్‌డీఓ వాసుచంద్ర, కలెక్టరేట్‌ ఏవో ఫర్హీన బేగం తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలు నేరం

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం.. అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్‌ దీపక్‌ తివారీ సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో బాలల మాక్‌ పార్లమెంట్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే సమాజంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఏఐ సాంకేతికతపై పట్టు సాధించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ శ్రీనివాస్‌, అడిషనల్‌ డీఆర్‌డీఏ నర్సింలు, పంచాయతీ రాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఉమేష్‌ కుమార్‌, వయోజన విద్య జిల్లా ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌బాబు, డీపీఎం నర్సింలు, కొమరయ్య, శేఖర్‌, నర్సింలు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జానకి, కార్యదర్శి శ్వేత, కోశాధికారి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

బార్వాద్‌లో సోలార్‌ ప్లాంట్‌

బంట్వారం: సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ఎంతగానో ఉపయోగకరమని కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. శనివారం కోట్‌పల్లి మండలం బార్వాద్‌లో పర్యటించారు. గ్రామంలో రూ.3 కోట్లతో చేపట్టిన సోలార్‌ ప్లాంట్‌ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండు సోలార్‌ ప్లాంట్లు నిర్మిస్తుండగా అందులో ఒకటి బార్వాద్‌లో ఉందన్నారు. ఇందిరా మహిళా శక్తి సభ్యులు ఈ పనులను చూసుకుంటారని తెలిపారు. అంతకుముందు ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం డ్వాక్రా భవనం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ శ్రీనివాస్‌, అడిషనల్‌ డీఆర్‌డీఓ సత్తెయ్య, ఎంపీడీఓ హేమంత్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, తెలంగాణ రెడ్‌కో జిల్లా మేనేజర్‌ శ్రీనివాస్‌రావు, సర్పంచ్‌ ప్రతిభ, జీపీ కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ దీపక్‌ తివారి

Advertisement
 
Advertisement
Advertisement