తాండూరు: పొగాకు ఆరోగ్యానికి చేటు. సిగరెట్ తాగడం వలన గుండె, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు క్యాన్సర్, డయాబెటిస్ తదితర వ్యాధులు సంక్రమిస్తాయి. అస్తమాకు దారితీస్తుంది. అయినప్పటికీ.. ఈ మానుకోలేని అలవాటుతో మనిషి తన జీవితకాలాన్ని ఐసుముక్కలా కరగదీసుకుంటు న్నాడు. దీంతో మరణాల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. పొగతాగడం, పొగాకు నమలడం అనారోగ్యమని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. ధూమపానం ప్రియులు పెరుగుతూనే ఉన్నారు. ఇక నిషేధించబడిన గుట్కాతో పాటు.. గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. గాంజా విక్రయించినా, సేవించినా నేరస్థులేనని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విక్రయదారులను వల పన్ని పట్టుకొని, రిమాండ్‌కు తరలిస్తున్న సంఘటనలు అనేకం. అయినా ఆశించిన ఫలితం శూన్యం.
ఏటా 70 లక్షల మంది బలి
పొగ తాగడం వలన కలిగే అనర్థాల గురించి ప్రజలకు తెలియజెప్పేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(ప్రపంచ ఆరోగ్య సంస్థ) 1987 మే 31వ తేదీని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా పేర్కొంది. నాటి నుంచి ఏటా పొగాకు నమలడం, ధూమపానం చేయడం ఆరోగ్యానికి చేటు అని ప్రచారం చేస్తూనే ఉంది. విస్తృతంగా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అయినప్పటికీ ప్రతి సంవత్సరం 60 నుంచి 70 లక్షల మంది పొగాకు బలవుతున్నారు. ప్రపంచ వ్యప్తంగా 13 కోట్ల మంది సిగరెట్ తాగుతుండగా.. అందులో 10 లక్షల మంది వరకు క్యాన్సర్ బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
దాడులు చేసినా జడవని వైనం
పొగాకుతో తయారు చేసిన గుట్కా, ఖైనీలను ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ.. జిల్లాలో పొగాకు వినియోగం అధికంగా ఉంది. కిరాణం, పాన్‌షాప్, షాపింగ్ మాళ్లలో అనేక రకాల సిగరెట్లతో పాటు నిషేధించబడిన గుట్కా లభిస్తున్నాయి. చేరువనే ఉన్న పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి గుట్కా క్రయవిక్రయాలదందా జోరుగా సాగుతోంది. రూ.కోట్లలో వ్యాపారం జరుగుతోంది. అధికారులు దాడులు చేస్తూ.. సరుకు స్వాధీనం చేసుకోవడంతో పాటు.. కేసులు నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ జడవని వ్యాపారులు దందాను మరింత విస్తృతం చేస్తున్నారు. చాపకింద నీరులా విస్తరిస్తూ సవాల్‌గా మారారు. నిషేధిత గుట్కాల స్థానంలో పాన్ మసాలను విక్రయిస్తున్నారు. వాటితో పాటు చిన్న ప్యాకెట్లలో జర్దా కలిపిన మిశ్రమాన్ని అమ్ముతూ సొమ్ము చేసుకొంటున్నారు.
పొగాకు క్యాన్సర్‌కు కారకం
అయినా పెరుగుతున్న ధూమపానం
చాపకింద నీరులా నిషేధిత గుట్కా దందా
విక్రయాలకు కేరాఫ్ అంతర్రాష్ట్ర సరిహద్దు
నేడు పొగాకు వ్యతిరేక దినోత్సవం
పొగతాగడం, గుట్కా తినడం ఆరోగ్యానికి హానికరం. కాన్సర్‌కు కారకం. ప్రాణాంతకం అని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయినప్పటికీ అలవాటు ఉన్న వారు మానుకోకపోగా.. కొత్తవారు ఈ దురలవాట్లకు చేరవవుతున్నారు. సిగరెట్, బీడితో పాటు నిషేధించబడిన గుట్కా తినేవారు, గంజాయి, డ్రగ్స్ తీసుకునే ఏటేటా పెరుగుతూనే ఉన్నారు. జీవితాలను కొవ్వొత్తిలా కరగదీసుకుంటున్నారు.


