అనంతగిరి: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను శనివారం స్పీకర్ ప్రసాద్‌కుమార్ కలిశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. అనంతరం ఇరువురు పలు విషయాలపై చర్చించినట్లు తెలిసింది.
అనంతగిరి: బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు గట్టు రాంచంర్‌రావు అన్నారు. ఈమేరకు శనివారం వికారాబాద్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో పట్టణ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్‌ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కడియాల వేణుగోపాల్, గోపాల్, పాండు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ వివాహిత శనివారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రక్షించారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రావణి.. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటుంది. కొంత కాలంగా భర్తతో గొడవల కారణంగా మనస్తాపం చెందిన ఆమె.. స్థానిక పెద్ద చెరువులో దూకేందుకు యత్నించింది. అంతలోనే పోలీసులకు సమాచారంఅందడంతో చెరువు సమీపంలో పరిశీలించారు. వెంటనే ఆమెను రక్షించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కౌన్సెలింగ్ ఇచ్చి, తల్లిదండ్రులకు అప్పగించారు. సకాలంలో స్పందించి మహిళా ప్రా ణాలు కాపాడిన సిబ్బందిని సీఐ మహేందర్‌రెడ్డి అభినందించారు. పోలీసులు మానవత్వం చాటు కోవడంతో పట్నం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
అనంతగిరి: బావిలో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందిన ఘటన శనివారం వికారాబాద్ ము న్సిపల్ పరిధిలోని ధన్నా రం పరిసరాల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ధన్నారానికి చెందిన వడ్డె యాదయ్య(35) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో మద్యం తాగి స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈక్రమంలో శ్వాస ఆడక నీళ్లలో మునిగి చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ రఘుకుమార్ తెలిపారు.


