ప్రమాదాలకు రోడ్డేస్తుండ్రు! | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాలకు రోడ్డేస్తుండ్రు!

May 30 2026 8:41 AM | Updated on May 30 2026 8:41 AM

20 మలుపులతో బీజాపూర్‌ హైవే నిర్మాణ పనులు దారిలేకుండా చేశారు

ఎన్‌హెచ్‌ 163 విస్తరణ ఇలా..

అప్పా నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్లుగా విస్తరణ పెద్దల భూములను వదిలేయడంతోనే వంకరటింకర లోపాలను సరిచేయాలని స్థానికులు, వాహనదారుల అభ్యర్థన

20 మలుపులతో బీజాపూర్‌ హైవే నిర్మాణ పనులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా/చేవెళ్ల/మొయినాబాద్‌: అనేక అవరోధాలను అధిగమించి ఆరు నెలల క్రితం ప్రారంభించిన హైదరాబాద్‌– బీజాపూర్‌ జాతీయ రహదారి (163) విస్తరణ పనులు వంకరటింకరగా సాగుతున్నాయి. ఇప్పటికే అనేక మంది మృతికి కారణమైన ఈ రోడ్డును రెండు నుంచి నాలుగు లేన్లకు విస్తరిస్తున్నప్పటికీ ప్రమాదాలకు కారణమైన మెజార్టీ మూల మలుపులను అలాగే ఉంచేస్తున్నారు. అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర 66 మలుపులు ఉండగా, వీటిలో 19 డేంజర్‌ స్పాట్లు ఉన్నట్లు ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. మెజార్టీ ప్రాంతాల్లోని ఇరుకైన మలుపులను సరి చేసినప్పటికీ.. 20 చోట్ల మలుపులు తిరిగింది. వీటిని సరి చేయకుండా ముందుకు వెళ్లడం భవిష్యత్తులో ప్రమాదాలను కొని తెచ్చుకో వడమే అనే ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్దల భూముల జోలికి వెళ్లకుండా, సామాన్య రైతుల నుంచే సేకరించడం, ప్రజలకు అవసరమైన చోట అండర్‌పాసులు నిర్మించకపోవడంపై విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. ఈ మార్గంలో గత ఆరేళ్లలో 300 మంది మృతి చెందగా, అనేక మంది కాళ్లు, చేతులు కోల్పోయి జీవచ్చవాలుగా మారారు. 2025 నవంబర్‌ 3 తెల్లవారు జా మున టిప్పర్‌– ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 19 మంది మృతి చెందగా, 27 మంది త్రీవంగా గాయపడటాన్ని తలుచుకుని స్థానికులు ఇప్పటికీ భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఆరు నెలల్లో అందుబాటులోకి..

రోజురోజుకూ యాక్సిడెంట్లు పెరగడంతో రోడ్డు విస్తరణపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకు అడ్డంకిగా ఉన్న భారీ మర్రి వృక్షాల్లో కొన్నింటిని మరో చోటకు తరలించి.. హరిత ట్రిబ్యునల్‌లో ఉన్న కేసును ఉపసంహరించుకునేలా చేసింది. టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్ట్‌ కంపెనీ డిసెంబర్‌లో పనులు ప్రారంభించింది. ఎలాంటి అడ్డంకులు లేని ప్రాంతాల్లో భూమిని చదును చేసి, మట్టితో పాటు కంకర పరిచింది. అవసరమైన చోట బైపాస్‌లు, కల్వర్టులు, అండర్‌పాస్‌ పనులు చేపట్టింది. ప్రస్తుతం ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇలాగే సాగితే ఆరు మాసాల్లో రోడ్డు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ‘సాక్షి’ నెట్‌వర్క్‌ బృందం శుక్రవారం ఈ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన చేసి, పలు లోపాలను గమనించింది.

అడ్డదిడ్డంగా భూసేకరణ..

● ఓఆర్‌ఆర్‌ సమీపంలోని అప్పా జంక్షన్‌ నుంచి ఈ రోడ్డు మొదలవుతుంది. ఇక్కడి నుంచి అజీజ్‌నగర్‌ వరకు 3 కిలోమీటర్ల మేర ఇప్పటికీ భూసేకరణ పూర్తి కాలేదు.

● అజీజ్‌నగర్‌ నుంచి జేబీఐటీ వరకు సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర భూసేకరణ చేసినా పనులు ప్రారంభించలేదు.

● రోడ్డుకు అడ్డుగా ఉన్న స్వామినారాయణ గురుకుల పాఠశాల భూములకు బదులు ఎడమవైపున ఉన్న సాధారణ రైతుల భూములను సేకరించారు. దీంతో ఇక్కడ రోడ్డు వంకరలు పోతోంది.

● జేబీఐటీ నుంచి తాజ్‌సర్కిల్‌ వరకు సుమారు 4.5 కిలోమీటర్ల మేర మొయినాబాద్‌ బైపాస్‌ రోడ్డు పనులు చేపట్టారు. టెన్నిస్‌ అకాడమీ వద్ద భూమిని ఇప్పటికీ చదును చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా ముర్తుజాగూడ నెస్ట్‌విల్లాస్‌ సమీపంలోనూ రోడ్డు నిర్మాణ పనుల్లో ఇబ్బందులు తప్పడం లేదు.

● తాజ్‌సర్కిల్‌ నుంచి చిన్నషాపూర్‌గేటు వరకు ప్రస్తుత రోడ్డుకు కుడివైపున భూసేకరణ చేసి, ఆ తర్వాత రోడ్డుకు ఎడమవైపునకు మార్చడంపై కూడా విమర్శలున్నాయి. నేరుగా కన్పించాల్సిన రోడ్డు నాలుగు వంకరలు తిరిగింది. రోడ్డుకు అడ్డుగా ఉన్న పెండ్యాల ఫాంహౌస్‌, ఆర్‌ఆర్‌ గుట్కా, గ్రీన్‌ఫీల్డ్‌ రిసార్ట్స్‌ అండ్‌ కన్వెన్షన్‌ భూములను కాపాడుతూ సాధారణ రైతుల భూములను తీసుకున్నారనే విమర్శులున్నాయి. కనకమామిడి నుంచి నేరుగా ఆర్‌ఆర్‌ గుట్కా మీదుగా రోడ్డు వేస్తే అప్పారెడ్డిగూడ– కనకమామిడి జంక్షన్‌ ఇందులో కలిసేది.

● ముడిమ్యాలకంచె, కందాడ మలుపులను సరి చేయకపోవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.

● మల్కాపూర్‌గేట్‌– కేసారం మూలమలుపు ప్రమాదకరంగా ఉంది. దామరగిద్ద, మీర్జాగూడ మలుపులు ఎప్పటిలాగే డేంజర్‌గా ఉన్నాయి.

● కేసారం– చేవెళ్ల బైపాస్‌(6.5 కిలోమీటర్లు) పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆలూరు–ఖానాపురం గేట్‌ మధ్య ఉన్న లింకును తెంచేయడంతో రోడ్డుకు, అటు ఇటుగా ఉన్న పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.

ఆర్‌ఆర్‌ గుట్కా కంపెనీ వద్ద మలుపు

చేవెళ్ల సమీపంలోని అటవీ భూమిలో

వంకరలు తిరిగిన రోడ్డు

‘ముందుచూపు లేకుండా విస్తరణ పనులు చేపడుతున్నారు. అవసరమున్న చోట వదిలేసి, అనవసరమైన చోట అండర్‌పాసులు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నారు. ఆలూరు, ఖానాపురం రోడ్ల లింకులను తెంపేశారు. ఇక్కడ అండర్‌పాస్‌ లేకపోవడంతో పది గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోనుంది. ప్రధాన రహదారి ఎత్తుగా ఉండటం, సర్వీసు రోడ్లు లేకపోవడంతో పక్కనున్న రైతులు పొలాల్లోకి వెళ్లలేని దుస్థితి నెలకొంటోంది. దీనిపై నేషనల్‌ హైవే అథారిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు’ అని నాంచేరి సర్పంచ్‌ పులిమామిడి అశోక్‌, ఖానాపూర్‌ వాసి తిరుపతిరెడ్డి, రైతులు అంజయ్య, పెంటయ్యగౌడ్‌, రాజలింగం తెలిపారు. కాంట్రాక్ట్‌ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, దుమ్ముధూళి ఎగిసి ఇళ్లపై పడుతోంది.

ఎక్కడి నుంచి ఎక్కడికి: అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు

విస్తరణ: రెండు నుంచి నాలుగు లేన్లుగా..

మొత్తం దూరం: 46.405 కిలోమీటర్లు

అవసరమైన భూమి: 266.55 హెక్టార్లు

ప్రభుత్వ భూమి: 69.25 హెక్టార్లు

ప్రైవేటు భూమి: 154.50 హెక్టార్లు

వెచ్చించిన నిధులు: 157 కోట్లు

కేటాయించిన బడ్జెట్‌: రూ.928.41 కోట్లు

నిర్మాణ సంస్థ: మెఘా

అగ్రిమెంట్‌ డేట్‌: 9మే 2022

అపాయింట్‌ డేట్‌: 27 నవంబర్‌ 2024

నిర్మాణ గడువు: 24 నెలలు

నిర్వహణ బాధ్యత: 15 సంవత్సరాలు

సర్వీసు రోడ్లు: 23.88 కిలోమీటర్లు

కల్వర్టులు: 112

వెహికిల్‌ అండర్‌పాస్‌లు: 08

లైట్‌ వెహికిల్‌ అండర్‌ పాస్‌లు: 07

ఆర్‌ఈ వాల్స్‌: 1,51,540 స్క్వేర్‌ మీటర్లు

ప్రధాన బ్రిడ్జిలు: 02

మేజర్‌ జంక్షన్లు: 04

మైనర్‌ జంక్షన్లు: 31

ట్రక్‌ లే బై: 01

టోల్‌ప్లాజా: 01(8 ఎంట్రెన్స్‌, 8 ఎగ్జిట్‌)

Advertisement
 
Advertisement
Advertisement