అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి
దోమ: కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి హెచ్చరించారు. శుక్రవారం దోమ, దిర్సంపల్లిలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ధాన్యం కుప్పలను చూసి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. గన్నీ బ్యాగులు అందడం లేదని పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. స్పందించిన అడిషనల్ కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్
అనంతగిరి: రాజకీయ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, కేంద్రం చట్టబద్ధ రాజ్యాంగ బద్ధ సంస్థలను అడ్డుపెట్టుకొని సీపీఎం నాయకత్వాన్ని బలహీన పరచలేరని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ అన్నారు. కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్‌పై ఈడీ దాడులకు వ్యతిరేకంగా శుక్రవారం వికారాబాద్‌లో నిరసన వ్యక్తం చేశారు. 15 ఏళ్లపాటు ఆదర్శ పాలన అందించిన వ్యక్తిపై ఈడీ దాడులు చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు సతీష్, గోపాల్‌రెడ్డి, లక్ష్మయ్య, రమేష్ కుమార్, బాలరాజు, గోపాల్, చందు, రత్నం, కిషన్ నాయక్, రాజు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
తాండూరు రూరల్: పెద్దేముల్ మండలానికి ఐదు ప్రీ ప్రైమరీ స్కూల్స్ మంజూరైనట్లు ఎంఈఓ నర్సింగ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 – 27 విద్యా సంవత్సరం నుంచి ఎంపీయూపీఎస్ గాజీపూర్, కందనెల్లి, ఇందూర్, మంబాపూర్, తట్టెపల్లిలో పాఠశాలలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా కార్పొరేట్ విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్మమని అన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి
బొంరాస్‌పేట: గిరిజన గ్రామ పంచాయతీల అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మూడుమామిళ్లతండాలో జీపీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. కడా నిధులు రూ.30 లక్షలతో భవన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడాలని సర్పంచ్ సువాలిబాయికి సూచించారు. కార్యక్రమంలో ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నర్సింలుగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ, నాయకులు వెంకట్‌రెడ్డి, చంద్రప్ప, గుండప్ప, చందర్, ప్రసాద్‌గౌడ్, జయరాం, నెల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వారందరినీ గుర్తించి ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని జిల్లా కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. శుక్రవారం వికారాబాద్‌లోని వికాస్ జూనియర్ కళాశాల ఆవరణలో తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లాలోని పలువురు మేధావులు, కళాకారులు, జర్నలిస్టులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారని వారి సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఉద్యమ నాయకులు విజయకుమార్, సురేష్, రవిశంకర్, గంగ్యా నాయక్, భాను, రామచందర్, శివకుమార్ రెడ్డి, శాంత్ కుమార్, దేవదాస్ పాల్గొన్నారు.


