రైతుల డిమాండ్లు
దోమ: ‘భూములపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఇండస్ట్రియల్ పేరిట బలవంతంగా లాక్కోవాలని చూడటం సరికాదు.. ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములిచ్చే ప్రసక్తే లేదు’.. అని కొండాయపల్లి రైతులు తేల్చి చెప్పారు. శుక్రవారం గ్రామంలో తహసీల్దార్ గోవిందమ్మ అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ వాసుచంద్ర రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భూ సేకరణ విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని పలువురు రైతులు పేర్కొన్నారు. గ్రామ పరిధిలోని 371.24 ఎకరాల పట్టా భూములు, 85.03 ఎకరాల లావని పట్టా భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 221 మంది రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తాతల కాలం నాటి భూములను కాపాడుకుంటూ వచ్చామని.. అవే జీవనాధారమని అధికారులకు విన్నవించారు. అలాంటి భూములను లాక్కుంటే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయని, వాటిలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఎక్కడికక్కడ తనిఖీలు
ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గ్రామానికి వచ్చి పోయే వారిని తనిఖీ చేశారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్, మరో ఇద్దరు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, 13 మంది ఎస్‌ఐలు, భారీగా పోలీసులు పాల్గొన్నారు.
భూమికి భూమి ఇవ్వాలి
రూ.50 లక్షల పరిహారం చెల్లించాలి
పరిశ్రమలు వస్తే ఇంటికో ఉద్యోగం, ప్లాట్ ఇవ్వాలి
రైతులే కంపెనీ పెట్టాలనుకుంటే భూమి కేటాయించి, ఆర్థిక సాయమందించాలి
బలవంతంగా లాక్కోవాలని చూస్తే చావే శరణ్యం
కొండాయపల్లి రైతుల ఆవేదన


