● రాపోల్, కళ్లాపూర్‌గ్రామాల రైతుల డిమాండ్
● అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన
పరిగి: పరిశ్రమల ఏర్పాటు పేరిట ప్రభుత్వం తలపెట్టిన భూ సేకరణ ప్రక్రియను వెంటనే ఆపాలని మండలంలోని రాపోల్, కళ్లాపూర్ గ్రామాల బాధిత రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం రాపోల్ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. నెల రోజుల క్రితం పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. నాటి నుంచి రెండు గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి తమ సమస్య పట్టడం లేదన్నారు. ఉన్న భూములు లాక్కుంటే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రమేయం లేకుండా బలవంతంగా భూములను లాక్కుంటోందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.. ప్రాణాలైన ఇస్తాం కానీ భూములు మాత్రం ఇవ్వమన్నారు. తాము ఓటు వేసి గెలిపించుకున్న ప్రభుత్వాన్ని తామే బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయ గ్రామాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


