● ఇసుక అక్రమ రవాణాకు
ఖాకీల రాచమార్గం
● మామూళ్ల మత్తులో జోరుగా దందా
● ఎక్మాయి, నావంద్గీ నుంచి తరలింపు
బషీరాబాద్: ఇసుక అక్రమ రవాణా బషీరాబాద్‌లో మరింత జోరందుకుంది. వారం రోజుల కిందట పోలీసుల వాహనాన్ని ఇసుక ట్రాక్టర్‌లతో ఢీకొట్టిన ఘటన తరువాత సైతం అక్రమార్కులు తగ్గేదేలె అంటూ వ్యవహరిస్తున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సి వారే మామూళ్ల మత్తులో అక్రమార్కులకు రాచమార్గం వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో మండలంలో అక్రమ రవాణా మూడు పూలు.. ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది.
రాజీ ప్రయత్నం విఫలం
మండలంలోని నావంద్గీ దగ్గర కాగ్నా నది, ఎక్మాయి దగ్గర పెద్ద వాగు నుంచి చీకటి పడితే చాలు ట్రాక్టర్ల మోత మోగుతుంది. భవన నిర్మాణాలకు అనుమతి రాకపోవడంతో ఇసుకకు మండలంలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఒక్క ఇసుక ట్రాక్టర్ రూ.4 వేల నుంచి రూ.5 వేలు పలుకుతుంది. దీంతో అక్రమార్కులు అడ్డదారి తొక్కుతున్నారు. మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు ఆ అధికారితో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు. సదరు నాయకుడు అక్రమార్కుల తరఫున మాట్లాడి ఇసుక అక్రమ రవాణాకు అనుమతులు ఇప్పిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మధ్యే పోలీసు జీపును ఢీకొట్టిన కేసులోనూ రాజీ కుదుర్చేందుకు సదరు నాయకుడు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. విషయం మీడియాలో రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలకు ఉపక్రమించినట్లు తెలిసింది.
మూడు ట్రాక్టర్లను పట్టించిన గ్రామస్తులు
ఎక్మాయి పెద్ద వాగు నుంచి గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడి ట్రాక్టర్‌తో పాటు కంసాన్‌పల్లి(బి) గ్రామానికి చెందిన వడిచర్ల బస్వరాజ్, హరిజన్ తుల్జప్ప అనే ముగ్గురు ట్రాక్టర్లు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆదివారం ఉదయం గ్రామస్తులు బషీరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఎక్మాయి గట్టు సమీపంలో బస్వరాజ్, తుల్జప్ప ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను, నీళ్లపల్లి సమీపంలో ఎక్మాయి గ్రామ లీడర్‌కు చెందిన ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. ఈ మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని ఠాణాకు తరలించారు. వీటిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.


