దుద్యాల్: మండల పరిధిలోని సంట్రకుంటతండాలో ఆదివారం గ్రామ సర్పంచ్ మాణిక్యనాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి సహకారంతో ఈజీఎస్ నిధులు రూ.5లక్షలతో రోడ్డు పనులు ప్రారంభించినట్లు సర్పంచ్ చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవినాయక్, నాయకులు సాల్యనాయక్, రాహుల్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు మేలు
మోమిన్‌పేట: పేదల వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన 56 మంది బాధితులకు రూ.24.96 లక్షల చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్‌తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పేదలు అనారోగ్యానికి గురైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సురేందర్, సర్పంచులు అశోక్, సుభాష్‌గౌడ్, సిరాజోద్దీన్, ఎజాస్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మట్టల ఆదివారం
మర్పల్లి: మండల పరిధిలోని బూచన్‌పల్లి, మర్పల్లి తదితర గ్రామాల్లో మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈస్టర్ పండుగకు ముందు చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పాస్టర్ల సమక్షంలో ఈత మట్టలను ప్రత్యేకంగా అలంకరించి ఏసుప్రభు చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించారు. బూచన్‌పల్లిలో చర్చీ ప్రాంగణం నుంచి ప్రధాన వీధుల గుండా చిన్నారులు చేపట్టిన ర్యాలీ గ్రామస్తులను ఆకట్టుకుంది. ఈ ఉత్సవాల్లో మత పెద్దలు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.
తుర్కయంజాల్: యువ క్రికెటర్లు క్రమశిక్షణ, కఠినశ్రమ, సరైన మార్గదర్శకత్వంతో ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అండర్ –19 భారత జట్టు ఆటగాడు అక్షత్ రెడ్డి అన్నారు. ఆదిబట్ల సర్కిల్ పరిధి బ్రాహ్మణపల్లి, జేబీ బృందావన్ కాలనీలోని స్మార్టీ క్రికెట్ అకాడమీలో ఆదివారం నూతన క్యాంప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ అకాడమీ ద్వారా భవిష్యత్తులో మంచి క్రికెటర్లు తయారు కావాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ కొంతం మధుసూదన్ రెడ్డి, ప్రొఫెషనల్ సీనియర్ కోచ్‌లు ఎస్.మల్లేశ్ యాదవ్, రమేష్ గౌడ్, అజయ్ రైనా, దయానంద్ పటేల్, పలువురు అండర్–19, హెచ్‌సీఏకి ప్రాతనిధ్యం వహించిన క్రికెటర్లు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం వెల్జాలలో గౌడసంఘం గ్రామ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తిరుమణి రాఘవేందర్‌గౌడ్‌ను నియమించారు. అనంతరం అధ్యక్షుడిని సంఘం సభ్యులు సన్మానించారు.


