బీజేపీ జిల్లా కన్వీనర్ ప్రహ్లాదరావు
కుల్కచర్ల: దేశాన్ని ఒకే తాటిపైకి తీసుకువచ్చే మహత్తర వేదిక మన్‌కీ బాత్ అని బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు అన్నారు. ఆది వారం మండల కేంద్రంలో మన్‌కీ బాత్ కా ర్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని అసాధారణ వ్యక్తులను ప్రపంచ దృష్టికి తీసుకురావడం స్ఫూర్తిదాయకమన్నారు. ఇది ప్రతి ఒక్కరిలో జాతీయభావాలు పెంపొందిస్తున్నారన్నారు. మన్‌కీబాత్ అనేది ఒక కార్యక్రమంలా కాకుండా కుటుంబాలను కలిపే ఒక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, సర్పంచ్ అంజిలయ్య, దిశ జిల్లా కమిటీ సభ్యులు జానకీరాం చౌహాన్, ఉప సర్పంచ్ విజయకుమార్, నాయకులు మైపాల్, చంద్రలింగం, కర్ణయ్య, ఆంజనేయులు, మహేశ్‌నాయక్, ప్రభునాయక్, ఆంజనేయులు, నర్సింలు పాల్గొన్నారు.
తాగిన మైకంలో కత్తితో దాడి
ఇద్దరికి తీవ్ర గాయాలు
ధారూరు: తాగిన మైకంలో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి ఇద్దరిపై కత్తితో దాడికి తెగబడిన సంఘటన మండల పరిధిలోని నాగ్‌సాన్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్డె రమేశ్ పాల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. ఆయన మద్యం తాగినప్పుడల్లా ఎదుటి వారితో గొడవకు దిగేవారు. శనివారం బంధువు చనిపోవడంతో అంత్యక్రియలకు వెళ్లొచ్చారు. ఈ క్రమంలో ఫుల్‌గా తాగిన మైకంలో రమేశ్ పశువుల పాకకు వచ్చారు. అక్కడే ఉన్న మహిపాల్, నాగార్జునలతో ఘర్షణకు దిగి కత్తితో దాడి చేశారు. విచక్షణ రహితంగా నరకడంతో ఇరువురూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవేందర్ ఆదివారం తెలిపారు.


