● పిల్లలు చూస్తుండగానే నీట మునిగిన తండ్రి
● పెద్దేముల్ మండలం ఇందూర్‌లో ఘటన
తాండూరు రూరల్: ఈత నేర్పించేందుకు పిల్లలను బావి వద్దకు తీసుకెళ్లిన తండ్రి, వారు చూస్తుండగానే నీట మునిగి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన ఇందూర్ గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. పెద్దేముల్ ఎస్‌ఐ ప్రశాంత్ వర్ధన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోయ జగన్(46), జగ్గమ్మ దంపతులు. వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. వీరికి నలుగురు కూతుర్లు. పెపద్ద కూమార్తె అశ్విని వివాహం జరిగింది. మిగతా ముగ్గురు అక్షిత, అంకిత, శృతిలు ఉన్నారు. వీరిలో అక్షిత పదో తరగతి పరీక్ష రాస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం కుమార్తెలతో గ్రామ శివారులోని ఓ బావి వద్దకు వెళ్లారు. వారిని ఒడ్డున ఉంచి, ఈత ఎలా కొట్టాలో చూపించేందుకు తొలుత జగన్ బావిలోకి దుకాడు. ఎంతకూ అతను బయటకు రాలేదు. దీంతో భయాందోళన చెందిన చిన్నారులు ఇంటికి వెళ్లి కుటుంబీకులకు విషయం చెప్పారు. వెంటనే వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. కొందరు స్థానికులు బావిలోకి దూకి చూడగా.. అప్పటికే జగన్ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ
యువకుడి మృతి
ఆమనగల్లు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి మృతి చెందిన సంఘటన పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. మారుతి షోరూం ఎదురుగా హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో పల్లపు చరణ్(20) అక్కడికక్కడే మృతిచెందాడు. మండలంలోని మంగళపల్లి చెన్నకేశవ కాలనీకి చెందిన చరణ్ స్థానిక పట్టణంలో ట్రాక్టర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఆయన బైక్‌పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు సందర్శించి వివరాలు సేకరించారు. కాగా హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారి మరమ్మతులు చేస్తుండటంతో ఒకవైపు రోడ్డును మూసి ఉంచి రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.


