సాంబారులో పురుగులు
మర్పల్లి బీసీ వసతి గృహంలో
విద్యార్థులకు నాసిరకం భోజనం
మర్పల్లి: మండల కేంద్రంలో నూతనంగా ఏర్పా టు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల బీసీ వసతి గృహంలో విద్యార్థులకు నాసిరకం భోజ నం వడ్డిస్తున్నారు. శనివారం సాంబారులో తెల్ల పురుగులు వచ్చాయి. దీంతో విద్యార్థులు భోజనం చేయలేదు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. వసతి గృహంలో మెనూ పాటించడం లేదని, విధిలేని పరిస్థితుల్లో నాసిరక భోజనం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఐటీఐ కళాశాల ఏర్పాటు చేశారు. వసతి గృహం ఏర్పా టు చేసిన నాటి నుంచి భోజనం బిల్లులు మంజూరు కాలేదు. సరైన సౌకర్యాలు లేక పోవడంతో కేవలం 35 మంది విద్యార్థులు మాత్రమే ఉంటున్నారు. సాంబారులో పురుగులు రావడంపై వార్డెన్ పండరీనాథ్‌ను వివరణ కోరగా చింతపండులో పురుగులు ఉన్నాయని, దాన్ని పడేసినట్లు తెలిపారు. ఇకపై పొరపాటు జరగకుండా చూసుకుంటామన్నారు. ప్రభుత్వం నుంచి భోజనం బిల్లులు రాలేదని, సొంత డబ్బు వెచ్చించాల్సి వస్తోందని తెలిపారు.


