ఆరోగ్యంతోనే మెరుగైన జీవనం
● కలెక్టర్ ప్రతీక్‌జైన్
● సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతగిరి గుట్టల్లో ట్రయల్ రన్
అనంతగిరి: ఆరోగ్యంతోనే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణ సమీపంలోని అనంతగిరిగుట్టలో సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ ప్రతీక్‌జైన్ జెండా ఊపి రన్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మానవ జీవితంలో ఆరోగ్యమే ప్రధానమని.. దేశ శ్రేయస్సు ఆరోగ్యవంతమైన జనాభాపై ఆధారపడి ఉంటుందన్నారు. అనంతగిరి అటవీ ప్రాంతం ఔషధ మొక్కలకు నిలయమని ఇక్కడి గాలి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు. ఈ ప్రాంతంలో తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ట్రయల్ రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అధ్యక్షుడు డాక్టర్ సోమా జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. అనంతగిరి అందాలపై అవగాహన కలిగించడం, ఫిట్‌నెస్ ప్రమోట్ చేయడం అసోసియేషన్ లక్ష్యం అన్నారు. ఈ రన్‌లో 1,500 మంది వరకు సభ్యులు పాల్గొన్నారని చెప్పారు. కాగా నిర్వాహకులు 5కే, 10కే, 20కే, 32కే రన్ విభాగాల్లో ఉత్తమ ప్రతిభకనబరిచిన వారికి పతకాలు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి పన్నాల హరిశ్చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మగ్గారి, రేస్ డైరక్టర్ సత్యనారాయణరెడ్డి, ప్రతినిధులు ప్రీతంరెడ్డి, సునీల్ చెన్నోజు, డాక్టర్ మహేశ్‌పటేల్, రవి సంబారి, సతీశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
పనుల పరిశీలన
అనంతగిరిగుట్టలోని అనంతగిరి ఎకో అర్బన్ పార్క్ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పార్కు ఎంట్రీ గేట్ పరిశీలించి బాగుందని కితాబిచ్చారు. పనులలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.


