డ్రోన్లపై డేగ కన్ను
తాండూరు టౌన్: రెండు రోజులుగా పట్టణ పరిధిలో రాత్రి వేళ డ్రోన్ల కదలికలు కలకలం రేపాయి. పెద్దేముల్ మండల పరిధిలోని పలు గ్రామాలతో పాటు పట్టణంలోనూ డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయాన్ని గమనించిన పోలీసులు రూరల్ సీఐ నగేశ్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని పలు లాడ్జిల ను జల్లెడ పట్టారు. ఇటీవల లాడ్జికి వచ్చిన వారి రికార్డులను, సీసీ పుటేజీలు పరిశీలించారు. పలు ఫాంహౌస్‌లను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానితులు జాడ దొరకలేదు. ఈ సందర్భంగా రూరల్ సీఐ నగేశ్ మాట్లాడుతూ రాత్రి వేళల్లోనే డ్రోన్లు ఎగరడంపై నిఘా పెట్టామన్నారు. తాండూరుకు వచ్చి వెళ్తున్న వాహనాలను తనిఖీ చేయడంతో పాటు అనుమానితులు ఎవరైనా లాడ్జిలలో బస చేశారా అనే విషయమై క్షుణ్ణంగా తనిఖీ చేశామన్నారు. ఏవియేషన్ డిపార్ట్‌మెంట్ వారు డ్రోన్లకు అనుమతి ఇచ్చారా అనే విషయమై వారిని సంప్రదిస్తామన్నారు. రాత్రి పెద్దేముల్ మండల పరిధిలో, తాండూరు పట్టణ పరిధిలో నాలుగు డ్రోన్ల జాడ తెలుసుకునేందుకు నాలుగు డ్రోన్లను ఎగురవేశారు. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు.
నాగులపల్లిలో పహారా
లాడ్జిలు, ఫాంహౌస్‌లను జల్లెడపట్టిన పోలీసులు


