ముప్పై ఏళ్లుగా ముగ్గురికే..
బషీరాబాద్: గ్రామ పంచాయతీ ఆర్థిక అవసరాలకు సొంతంగా వనరులను సమకూర్చుకుంటుంది. వాటి ద్వారా వచ్చే ఆదాయంతో గ్రామంలో అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తుంది. బషీరాబాద్ మేజర్ పంచాయతీ తీరు ఇందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వ నిధులతో కట్టిన వాణిజ్య దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన విషయం తాజాగా వెలుగు చూసింది. జీపీ ఆధీనంలో నడిచే రెండు నీటిశుద్ధి కేంద్రాలు కిరాయి చెల్లించకున్నా కరెంటు బిల్లులు చెల్లిస్తూ పంచాయతీ ఆదాయానికి రూ.లక్షల్లో గండికొడుతున్నారు. ఇంత జరుగుతున్నా పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.
మూడు దుకాణాలకు
రూ.150 చొప్పున కిరాయి
మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో 1996లో అప్పటి సర్పంచ్ డాక్టర్ రాంప్రసాద్ మూడు వాణిజ్య దుకాణాలను నిర్మించారు. అప్పటి అధికారులు వీటిని సిరాజుద్దీన్, శంకర్‌రావు, రమేశ్‌కు కేటాయించారు. ప్రతీ నెల పంచాయతీకి రూ.150 కిరాయి చెల్లించాలని సూచించారు. కాగా 2009లో రమేశ్ తనకు కేటాయించిన షాపును శ్రీనివాస్‌గౌడ్‌కు అప్పగించాడు. నాటి నుంచి జీపీకి కిరాయి చెల్లించడంలేదని పంచాయతీ రికార్డులు సూచిస్తున్నాయి.
రికార్డులు మాయం!
వాణిజ్య దుకాణాలు కేటాయించిన రికార్డులు పంచాయతీ కార్యాలయంలో మాయమయ్యాయి. దీంతో పంచాయతీ అధికారులు వాటికి వేలం వేయడం మరిచిపోయారు. 2015లో అప్పటి సర్పంచ్ జయమ్మ వీటిపై ఆరా తీస్తే కిరాయిలు చెల్లించిన దాఖలాలు లేవు. దీంతో నాటినుంచి నెలకు ఒక్కో దుకాణం రూ.400 చెల్లించాలని తీర్మాణం చేశారు. గడిచిన రెండేళ్లుగా రూ.400 చొప్పున చెల్లిస్తున్నారని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.
ఆదాయానికి గండి
మూడు షాపులకు ప్రతీ సంవత్సరం వేలం నిర్వహించాల్సి ఉంటుంది. ఒక్కో షాపునకు రూ.లక్ష వరకు డిపాజిట్ పెట్టాలి. కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో పంచాయతీ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఓ వైపు పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించడానికి, వీధి లైట్ల ఏర్పాటుకు నిధులు లేవని చెప్పే అధికారులు రూ.లక్షల ఆదాయం వచ్చే దుకాణాలను ఎందుకు వదిలేస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అత్తెసరు కిరాయిలకు దుకాణాలను ధారాదత్తం చేస్తారా అంటూ మండిపడుతున్నారు.
కరెంటు బిల్లుల చెల్లింపు
2005లో గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వ భవనాల్లో రెండు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క రూపాయికి బిందెడు శుద్ధిచేసిన నీళ్లు ఇవ్వాలని నిర్వాహకులకు అప్పట్లో అధికారులు సూచించారు. కాగా నింబధనలు తుంగలో తొక్కిన నిర్వాహకులు దాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. ఒక్కో బిందెకు రూ.10 నుంచి రూ.15 వరకు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వీటికి కరెంటు బిల్లులు మాత్రం ప్రతీ నెలా పంచాయతీ ఖాతాలో నుంచి రూ.4 వేలకు పైగా అధికారులు చెల్లించడం గమనార్హం. ఇంత జరుగుతున్నా పంచాయతీ ప్రత్యేక అధికారిగా ఉన్న ఎంపీడీఓగానీ, జిల్లా పంచాయతీ అధికారిగానీ పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
నేటికీ దుకాణాలకు వేలం వేయని వైనం
టాక్స్ చెల్లించని రెండు నీటి శుద్ధి కేంద్రాల నిర్వాహకులు
బషీరాబాద్ పంచాయతీ నుంచి నెలనెలా విద్యుత్ బిల్లుల చెల్లింపులు
పట్టించుకోని జిల్లా పంచాయతీ అధికారులు
పంచాయతీ సొమ్ము పక్కదారి పడుతోందంటూ గ్రామస్తుల ఆగ్రహం
ముప్పై ఏళ్లుగా ముగ్గురికే..


