పత్తి విక్రయం ఇక సులువు
కొత్త యాప్‌తో ప్రయోజనం
● అందుబాటులోకి కపాస్ కిసాన్ యాప్
● స్లాట్ బుక్ చేసుకుంటేనే కొనుగోలు
● రైతులకు ఎంతో మేలంటున్న అధికారులు
దుద్యాల్: పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా కపాస్ కిసాన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సీజన్‌లో పత్తి అమ్ముకోవాలనుకునే రైతులు తమ వివరాలతో పాటుగా, పంట సాగుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల రద్దీని తగ్గించడమే కాకుండా అక్రమాలను అడ్డుకోవచ్చని సీసీఐ భావిస్తోంది.
తేమ శాతం ఆధారంగా ధర
పత్తిలో తేమ శాతం ఆధారంగా సీసీఐ వారు ధరను చెల్లించనున్నారు. ప్రభుత్వం క్వింటాలు పత్తికి కనీస మద్దతు ధరను రూ.8,110గా నిర్ణయించింది. తేమ 12 శాతం మించి ఎక్కువ ఉంటే సీసీఐ వారు పత్తిని కొనుగోలు చేయరు.
పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్
సీసీఐ తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్‌ను స్మార్టు ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌ను డౌన్‌లోడ్ తర్వాత పేరు, జండర్, పుట్టిన తేదీ, కులం, చిరునామా, ఆధార్, ఫోన్ నంబర్‌లతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, తర్వాత తాము ఏ కొనుగోలు కేంద్రంలో పత్తి అమ్మాలనుకుంటు న్నారో వివరాలు సైతం యాప్‌లో నమోదు చేయాలి. అదేవిధంగా పట్టాదారు పాస్‌పుస్తకం, సర్వేనంబర్, రైతుకు ఉన్న భూమి, పత్తి సాగు చేసిన విస్తీర్ణం, రైతు ఫొటో, ఆధార్ కార్డును యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. దీంతో ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. పత్తి అమ్మిన తర్వాత ఆధార్ నెంబర్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో అధికారులు నగదు జమ చేస్తారు. రైతుల సౌకర్యార్థం పత్తి కొనుగోలు సంబంఽధిత సేవలకు 18005995779 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
కావాల్సిన పత్రాలు
రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు
పట్టాదారు పాసు పుస్తకం
బ్యాంక్ ఖాతా పుస్తకం
ఆధార్‌కు బ్యాంక్ ఖాతాతో లింక్ అయిన
మొబైల్ ఫోన్ నంబర్
గతంలో పత్తి విక్రయించేందుకు జిన్నింగ్ మిల్లుల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. కపాస్ కిసాన్ యాప్‌తో ఈ సమస్య ఉండదు. ఒక కొనుగోలు కేంద్రం వద్ద ఒక రోజు పరిమిత సంఖ్యలో రైతులకు స్లాట్ బుక్ అవుతుంది. వారు మాత్రమే వచ్చి పంటను విక్రయించుకోవాలి. రైతుల సౌలభ్యం కోసమే ఈ య్యాప్‌ను రూపొందించారు. ఈ అవకాశాన్ని పత్తి రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – నాగరాజు, మండల వ్యవసాయాధికారి, దుద్యాల్
పత్తి విక్రయం ఇక సులువు


