బాలింత మృతిపై ఆందోళన
● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆగ్రహం
● విచారణ జరపాలంటూ ప్రజా సంఘాల డిమాండ్
ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు
ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజాసంఘాల నాయకులు
తాండూరు టౌన్: ఓ బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం బాలింత మృతి చెందిన ఘటన తాండూరు పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. ఇటీవల కాలంలో గర్భిణిలు, బాలింతలు, శిశు మరణాలు ఎంసీహెచ్‌లో పరిపాటిగా మారాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోట్‌పల్లి మండలం ఎన్నారం గ్రామానికి చెందిన రజిత(25) రెండో కాన్పు నిమిత్తం పురిటి నొప్పులతో తాండూరులోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేరింది. ఆదివారం వైద్యులు ఆపరేషన్ చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత బాలింత మృతి చెందిందని వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వారు శోకసముద్రంలో మునిగిపోయారు. అర్ధరాత్రి వరకు క్షేమంగానే ఉండి, శిశువుకు పాలిచ్చిన బాలింత ఎలా మృతి చెందిందని భర్త ఆనంద్‌తో పాటు కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందిని నిలదీశారు. కనీసం ఏ కారణం చేత మృతి చెందిందనే విషయాన్ని సైతం డాక్టర్లు చెప్పడం లేదని వాపోయారు. సోమవారం ఉదయం మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అనంతరం యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని, రాత్రి వేళ వైద్యులు ఉండటం లేదని, సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమగ్ర విచారణ జరపాలి
బాలింత మృతిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని పలు ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉండాల్సిన వైద్యులు తమ సొంత క్లినిక్‌లలో సేవలందిస్తూ, ఎంసీహెచ్‌లోని పేషెంట్లను గాలికి వదిలేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి సంబంధీకులను సస్పెండ్ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కేఎన్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రప్ప, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆనంద్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కే శ్రీనివాస్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పీ శ్రీనివాస్ తదితరులు డిమాండ్ చేశారు.
బాలింత మృతిపై ఆందోళన
బాలింత మృతిపై ఆందోళన


