ఆయిల్ పామ్‌కు ప్రోత్సాహం
అనంతగిరి: జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచడం ద్వారా రైతులకు ఆదాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆదాయం పెరిగేలా ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 2,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు పెంచాలనే లక్ష్యం ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, అంతర పంటల ద్వారా సమకూరే ఆదాయం, డ్రిప్ రాయితీల గురించి రైతులకు తెలియజేయాలన్నారు. పండ్ల తోటలు, కూరగాయల సాగు, ఆధునిక సాగు పద్ధతులు తెలియజేయాలని సూచించారు. కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్లు తదితర సదుపాయాలను కల్పించాలన్నారు. రాయితీపై డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. నెలలో ఒకసారి రైతు వేదికల్లో పంటల సాగు, ప్రభుత్వం కల్పించే సదుపాయాలు, పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఉద్యాన వన శాఖ జిల్లా అధికారి ఎంఏ సత్తార్ ఆయిల్ పామ్ సాగుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, కో ఆపరేటివ్ ఆఫీసర్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో సాగు లక్ష్యం 2,500 ఎకరాలు
అడిషనల్ కలెక్టర్ సుధీర్
ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు


