ఏం రోడ్లో ఏమో!
చిన్నపాటి వర్షానికే కుంటలను తలపిస్తున్న రహదారులు
తాండూరు టౌన్: చిన్నపాటి వర్షాలకే తాండూరు రోడ్లు జలమయంగా మారుతాయి. కనీసం నడవడానికి కూడా వీలుండదు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి ఉన్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జనావాసాల మధ్య వర్షపు నీరు నిలవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగలు వృద్ధి చెంది ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు. పలుమార్లు పాలకులు, అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా వారిలో మాత్రం చలనం కనబడటం లేదు. శుక్రవారం రాత్రి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. వరదలో మురుగునీరు చేసి ఎక్కడిక్కడ నిలిచిపోయింది. చాలా ఏళ్ల కిత్రం వేసిన సీసీ రోడ్లు కావడంతో మురుగు కాలువలు ఎత్తుగా ఉండటంతో వరదనీరు నడి రోడ్డుపై ప్రవహిస్తోంది. కొన్ని చోట్ల మురుగునీరుతో కలిసి వరదనీరు జనావాసాల మధ్యనే నిలిచి దుర్గంధాన్ని పెంచుతోంది. పట్టణంలోని సాయిపూర్, నంబర్ వన్ స్కూల్ ప్రాంతం, శాంతినగర్, మిత్రనగర్, మార్కండేయ కాలనీ, ఆదర్శ నగర్, గ్రీన్ సిటీ, పాత తాండూరుతో పాటు పలు ప్రాంతాలు బురదమయంగా మారాయి. ప్రధాన రహదారులు సైతం గుంతల మయంగా మారి వరదనీటితో నిండటంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం వరదనీరు సులభంగా పట్టణం బయటకు వెళ్లేందుకు సరైన కా లువలు నిర్మించలేకపోవడం గమనార్హం.ఇప్పటికై నా అధికారులు స్పందించి అవసరమైన చోట సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టి ప్రజల ఇబ్బందులను గట్టెక్కించాలి.


