
వరద నీరు వస్తుందని ఆందోళన
తాండూరు రూరల్: మండలంలోని సంగెంకలాన్ గ్రామ శివారులోని చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై తమకు నమ్మకం లేదని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామ సమీపంలోని బండలవాగు వద్ద రైల్వేట్రాక్ ఫిల్లర్లతో వరద నీరంతా ఎస్సీకాలనీలో వస్తోందని ఆందోళన చేపట్టారు. రెండోరోజు సోమవారం సైతం గ్రామ శివారులో ఉన్న రైల్వేట్రాక్ వద్ద గూడ్స్ రైలును అడ్డుకున్నారు. దాదాపు గంటపాటు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న చెట్టినాడు ప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ తమకు నమ్మకం లేదని గ్రామస్తులు మండిపడ్డారు. ఆందోళన చేసిన తర్వాత పరిష్కారిస్తామని చెప్పి కనిపించకుండా పోతారని వాపోయారు. భారీ వర్షం కారణంగా ఎస్సీకాలనీలోని ఇళ్లల్లోకి మోకాళ్లలోతు వరద నీరు వచ్చిందన్నారు. నిత్యవసర సరుకులు పాడయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతకి ఆందోళన విరమించకపోవడంతో కంపెనీ జీఏం శేఖర్‌బాబు ఎస్సీకాలనీలో పర్యటించారు. కాలనీవాసులతో మాట్లాడి నిత్యవసర సరుకులు, సామగ్రిని అందజేస్తామని హామీ ఇచ్చారు. గూడ్స్‌రైలును ఆపిన విషయం తెలుసుకున్న కరన్‌కోట్ ఎస్‌ఐ రాథోడ్ వినోద్, తాండూరు రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఆందోళనకారులకు సర్ది చెప్పారు.
రైలు పట్టాలపై కూర్చున్న
సంగెంకలాన్ గ్రామస్తులు