
స్థానిక నగారా
మూడు విడతల్లోగ్రామ పంచాయతీ ఎలక్షన్ అమలులోకి వచ్చిన కోడ్ ఏర్పాట్లలో అధికార యంత్రాంగం
వికారాబాద్: ఎప్పుడెప్పుడా అని అంతా ఆశగా ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఇప్పటికే ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ జారీ చేసిన నేపథ్యంలో తాజాగా ఎన్నికల సంఘం గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తొలి విడతలో పార్టీ గుర్తులపై నిర్వహించే జిల్లా, మండల ప్రాదే శిక స్థానాలకు ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత సర్పంచ్, వార్డులకు ఓటింగ్ జరుగనుంది. రెండు విడతల్లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు, మూడు విడతల్లో జీపీల ఎన్నికలు నిర్వహించనున్నారు. సోమవారం నుంచే కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో పోలింగ్ బూత్‌లను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.
పరిషత్‌కు రెండు విడతల్లో..
జిల్లాలో 20 జెడ్పీటీసీ, 20 ఎంపీపీ, 227 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా, మన జిల్లాలో మాత్రం రెండు విడతల్లో పూర్తి చేయనున్నారు. తొలి విడతలో ఎన్నికలు నిర్వహించనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అక్టోబర్ తొమ్మిదిన నోటిఫికేషన్ జారీ చేసి, అదే రోజు నుంచి 11వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 12న నామినేషన్ల స్కూట్నీ చేసి, అర్హులైన అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్నారు. 13న అభ్యంతరాలను స్వీకరించి, 14న పరిష్కరించనున్నారు. 15న నామినేషన్ల ఉప సంహరణ సహా అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. 23న ఉదయం 7 నుంచి 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక రెండో విడతలో ఎన్నికలు నిర్వహించనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అక్టోబర్ 13న నోటిఫికేషన్ జారీ చేసి, అదే రోజు నుంచి 15 వరకు నామినేషన్లు స్వీకరించనుంది. 16న స్క్రూట్నీ, అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ఆ తర్వాత 17న అభ్యంతరాల స్వీకరణ, 18న పరిష్కారం, 19న నామినేషన్ల తిరస్కరణ సహా అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనుంది. 27న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలు నిర్వహించనుంది. తొలి, విడత మలి విడత ఎన్నికల ఫలితాలను నవంబర్ 11న విడుదల చేయనుంది.
జీపీలకు మూడు విడతల్లో..
జిల్లాలో 594 గ్రామ పంచాయతీలు, 5,058 వార్డులు ఉన్నాయి. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు అక్టోబర్ 17న ప్రారంభమై 31వ తేదీతో ముగియనున్నాయి. రెండో విడత అక్టోబర్ 21న ప్రారంభమై నవంబర్ 4తో, మూడో విడత అక్టోబర్ 25న ప్రారంభమై నవంబర్ 8తో ముగుస్తాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడించనున్నారు.
అమలులోకి ఎన్నికల నియమావళి
ఎన్నికల కోడ్ సోమవారం నుంచే అమలులోకి వచ్చింది. వరుస ఎన్నికల నేపథ్యంలో అభివృద్ధి పనులకు కోడ్ అడ్డంకిగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యవసరాలు తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ తదితర పనులను మాత్రం అధికార యంత్రాగమే నిర్వహించనుంది. ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయడానికి వీలులేదు. ఓటర్లను ప్రలోభపెట్టే పథకాలు, కార్యక్రమాలు నిర్వహించరాదు. నిధులు మంజూరైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు మరో నెలరోజులపాటు బ్రేక్ పడనుంది. ఇప్పటికే నిధులు మంజూరై కొనసాగుతున్న పనులకు మాత్రం ఎలాంటి ఆటంకం ఉండదు. సంక్షేమ పథకాల అమలులో కూడా కొత్త లబ్ధిదారుల ఎంపిక జరగదు. అదే విధంగా పాత లబ్ధిదారులకు మాత్రం యథాతథంగా ఫలాలు అందనున్నాయి.
జిల్లాలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

స్థానిక నగారా

స్థానిక నగారా