
బీసీకే పట్టం
న్యూస్‌రీల్
జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ల వివరాలు
వరుస వానలు.. ఏకధాటి వర్షాలకు జిల్లా వాసులు బెంబేలెత్తారు. వాగులు, వంకలు పొంగిపొర్లి పంటలు, రోడ్లు పాడయ్యాయి.
జెడ్పీ పీఠం..
వికారాబాద్: ఎట్టకేలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు వచ్చేశాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కేటాయింపు నేపథ్యంలో ఏడాది నుంచి ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన లిస్టు విడుదల చేసింది. దీంతో ఉత్కంఠ వీడింది. త్వరలో షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆశావహులు ఎన్నికలకుసంసిద్ధమవుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు సంతోషంలో ఉండగా.. ప్రతికూలంగా రిజర్వేషన్లు వచ్చిన వారు నిరాశకు గురవుతున్నారు. తొలిసారి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించటంతో జనాభాలో అత్యధికులుగా ఉన్న బీసీలకు ఎక్కువ స్థానాలు దక్కాయి. జిల్లాలో అత్యధిక ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలు బీసీలకు కేటాయించారు. జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం సైతం బీసీ జనరల్ కావడంతో పార్టీలు బలమైన బీసీ నేతల వేటలో పడ్డాయి. తాజాగా విడుదల చేసిన రిజర్వేషన్ల ప్రకారం 20 మండలాల్లో ఎనిమిది ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు బీసీలకు కేటాయించారు. 227 ఎంపీటీసీ స్థానాల్లో 94 ఎంపీటీసీ, 594 పంచాయతీల్లో 250 సర్పంచ్ స్థానాలకు బీసీలకు రిజర్వ్ అయ్యాయి.
మద్దతు కూడగట్టుకుంటున్న ఆశావహులు
జిల్లాలో గతంలో 367 పంచాయతీలుండగా అదనంగా మరో 227 జీపీలు పెరిగాయి. ప్రస్తుతం జిల్లాలో వ్యాప్తంగా 594 గ్రామ పంచాయతీలు ఏర్పాడ్డాయి. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలను గతంలో ఎస్టీలకే రిజర్వు చేశారు. దీంతో బీసీ రిజర్వేషన్లకు అన్యాయం జరిగిందనే వాదన సైతం తెరపైకి వచ్చింది. ఇప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రకటనతో ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. జిల్లాలో గతంలో 4,850 వార్డులుండగా ప్రస్తుతం జిల్లాలో 5,058 వార్డులకు పెరిగాయి. ఈ వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఆశావహులు తమ గ్రూపులు, వర్గాలను కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. మద్దతుదారులను పోగేసుకోవటంతో పాటు తమ ప్రాతినిథ్యాన్ని బలపర్చాలని ముఖ్య కార్యకర్తల మద్దతు కూడగట్టుకుంటున్నారు.
ఇక వరుస ఎన్నికలు!
అన్ని సజావుగా జరిగితే వరుస ఎన్నికలు రావటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగియగా మరో ఎన్నికల పండగకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామ పంచాయతీల పదవీకాలం గతేడాది జనవరి 31తో ముగియగా ఫిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారుల పాలన జీపీలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం పరిషత్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ప్రకటించడంతో పాటు నోటిఫికేషన్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వరుస ఎన్నికలు రావటం ఖాయమనే తెలుస్తోంది. ఇప్పటికే కలెక్టర్లు, డీపీఓలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఎప్పుడు అనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది.
జెడ్పీటీసీ స్థానం రిజర్వేషన్
దుద్యాల, దోమ, మర్పల్లి, కుల్కచర్ల బీసీ మహిళ
దౌల్తాబాద్, మోమిన్‌పేట, బొంరాస్‌పేట జనరల్ మహిళ
పూడూరు, కోట్‌పల్లి ఎస్సీ మహిళ
చౌడాపూర్ ఎస్టీ మహిళ
యాలాల, ధారూరు, బంట్వారం, బషీరాబాద్ బీసీ జనరల్
తాండూరు, కొడంగల్, నవాబుపేట జనరల్
వికారాబాద్, పరిగి ఎస్సీ జనరల్
పెద్దేముల్ ఎస్టీ జనరల్

బీసీకే పట్టం